‘అవును కశ్మీర్‌లో పరిస్థితి సాధారణమే.. కానీ’

19 Aug, 2019 20:08 IST|Sakshi

చెన్నై: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లోని  తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని ప్రభుత్వం చెపుతున్న విషయాలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణస్థితికి వచ్చాయి. పాఠశాలలూ తెరుచుకున్నాయి. కానీ, విద్యార్థులు లేరు. పరిస్థితులు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. కానీ, ఇంటర్నేట్‌ సేవలు  మరోసారి నిలిపేశారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కానీ మెహబూబా ముఫ్తి ఇంకా నిర్భంధంలోనే ఉన్నారు. మీరు ఇక్కడ ఏం జరుగుతుందోనని ఆలోచిస్తుంటే.. అక్కడ ఇది కొత్త సాధారణ పరిస్థితి అని దయచేసి అర్థం చేసుకోండి’ అని చిదంబరం ట్విటర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో మరోసారి ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయడం, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకా నిర్బంధంలో ఉంచడంపై ఆమె కూతురు ఇల్తిజా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన విషయాలను ప్రస్తావిస్తూ.. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కశ్మీర్‌ సాధారణంగా ఉందని కేంద్రం చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలు సడలించడంతో  కశ్మీర్‌లో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఎక్కడా విద్యార్థులు కనిపించడం లేదు. శ్రీనగర్‌ పట్టణంలో 190 ప్రాథమిక పాఠశాలలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ గత రెండు రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. 

మరిన్ని వార్తలు