'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

3 Sep, 2019 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా 300 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ మరో రెండు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్‌ కోర్టు మంగళవారం అనుమతించింది. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను తిహార్‌ జైలుకు పంపకుండా, గృహ నిర్బంధంలోనే ఉంచి విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఆయనకు తాత్కలిక ఉపశమనం లభించింది.

అయితే మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5% అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం  ఐదు వేళ్లను చూపారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ముందంజలో ఉన్నభారత్‌, ఏప్రిల్-జూన్‌లో నమోదైన జీడీపీ వృద్ధితో చైనా కంటే వెనుకబడి ఉంది.

>
మరిన్ని వార్తలు