బలంగా, ధైర్యంగా ఉంటాను: చిదంబరం

23 Sep, 2019 19:14 IST|Sakshi

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను కూడా ధైర్యంగా ఉంటానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం విచారణ అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సోమవారం జైలులో చిదంబరాన్ని కలిశారు.

చదవండి : చిదంబరాన్ని కలిసిన సోనియా, మన్మోహన్‌

ఈ నేపథ్యంలో వారితో భేటీ విషయమై చిదంబరం ట్విటర్‌లో స్పందించారు. ‘నా తరపున నా కుటుంబాన్ని ట్వీట్‌ చేయని కోరాను. ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ, డా. మన్మోహన్‌సింగ్‌ నన్ను కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నంత కాలం నేను కూడా బలంగా ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా... ‘దేశం అంతా బాగానే ఉంది, నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాన్ని తొలగించడం, తక్కువ వేతనాలు, కశ్మీర్‌ సమస్య, విపక్ష నాయకులను జైలుకు నెట్టడం మినహా’ అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చిదంబరం మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు