అక్టోబర్‌ 17 వరకూ చిదంబరం కస్టడీ పొడిగింపు

3 Oct, 2019 17:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు అక్టోబర్‌ 17 వరకూ పొడిగించింది. జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగించాలని కోరుతూ దర్యాప్తు సంస్థ సీబీఐ అప్పీల్‌ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరంను ఆగస్ట్‌ 21న సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి ముఖర్జి, పీటర్‌ ముఖర్జియాలు అప్రూవర్‌గా మారిన ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. కాగా ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం పీటర్‌, ఇంద్రాణిలు ముంబై జైలులో ఉన్నారు. ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరంపై ఈడీ సైతం 2017లో మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌ను కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం చిదంబరం తాజాగా అప్పీల్‌ చేశారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని చిదంబరం తరపు న్యాయవాది సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా,జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం బెంచ్‌ను కోరారు.

మరిన్ని వార్తలు