కుదరని రాజీ.. తొలగని సంక్షోభం!

17 Jan, 2018 02:29 IST|Sakshi

ఇంకా సమసిపోని సుప్రీంకోర్టు జడ్జీల వివాదం

సీజేఐ దీపక్‌ మిశ్రాతో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల భేటీ

సంక్షోభం ఇంకా ముగిసినట్లు లేదు: అటార్నీ జనరల్‌

రెండు మూడ్రోజుల్లో పరిష్కారం కావచ్చు: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నెలకొన్న సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి  (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా,  నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. జస్టిస్‌ మిశ్రాతో.. ఆయనపై ప్రెస్‌మీట్‌లో తీవ్ర విమర్శలు చేసిన జడ్జీలు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ మంగళవారం భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగిందని, ఇందులో వీరితో పాటు మరికొందరు న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారని సుప్రీం వర్గాలు వెల్లడించాయి.

తర్వాత జడ్జీలంతా విధుల్లోకి వెళ్లారు. అయితే, ఈ భేటీ అనంతరం వివాద పరిష్కారానికి సంబంధించి కానీ, రాజీ మార్గానికి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే, వారి మధ్య ఏయే అంశాలు చర్చకొచ్చాయన్న విషయమూ తెలియరాలేదు. కాగా, ఈ సంక్షోభాన్ని కుటుంబ వివాదంగా, టీ కప్పులో తుపానుగా అభివర్ణించి, సమస్య పరిష్కారమైందంటూ సోమవారం ప్రకటించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. మంగళవారం మాత్రం సమస్య ఇంకా పరిష్కారమైనట్లు కనిపించడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పడం గమనార్హం.  

టీ కప్పులో తుపాను
ఇది చిన్న కుటుంబ వివాదమని, ఇది కూడా ముగిసినట్లేనని అటార్నీ జనరల్‌(ఏజీ) కేకే వేణుగోపాల్‌తో పాటు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్‌ మన్‌ కుమార్‌ మిశ్రాలు సోమవారం చెప్పారు. దీంతో ఇకపై అంతా సజావుగా సాగుతుందని న్యాయ వర్గాలు భావించాయి. నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు తమ విధులకు హాజర య్యారని, పరిస్థితి అదుపులోనే ఉందని, అంతా చక్కబడిందని ఏజీ చెప్పారు. ఇంతవరకూ తాను సీజేఐ సహా ఏ న్యాయమూర్తిని కలవలేదన్నారు.

మన్‌ మిశ్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కుటుంబంలోని అంతర్గత విషయాలు.. అవి అంతర్గతంగానే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. అంతకుముందు రోజు మిశ్రా నేతృత్వంలోని ఏడుగురి బృందం వివాద పరిష్కారం కోసం సీజేఐతో పాటు సుప్రీంకోర్టులోని 15 మంది న్యాయమూర్తులతో విస్తృతంగా చర్చించింది. సంక్షోభం సర్ధుకుందని అందరూ అనుకుంటోన్న తరుణంలో అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ మంగళవారం మాట్లాడుతూ.. ‘సంక్షోభం సమసిపోలేదని అనుకుంటున్నాను. రెండు మూడ్రోజుల్లో అంతా పరిష్కారమవుతుందని ఆశిద్దాం’ అని చెప్పడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై పిటిషన్‌ తిరస్కరించిన సీజేఐ
సీజేఐ, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల మధ్య విభేదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలపై సోమవారం ఆసక్తి కొనసాగింది. శుక్రవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అనంతరం తొలిసారి వారు విధులకు హాజరయ్యారు. తన కోర్టు గదిలో సీజేఐ జస్టిస్‌ మిశ్రా రోజువారీ కేసుల విచారణను ప్రారంభించగానే.. నలుగురు న్యాయమూర్తుల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ విషయాన్ని న్యాయవాది ఆర్‌పీ లూథ్రా ప్రస్తావిస్తూ.. చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఆ పిటిషన్‌ను సీజేఐని తిరస్కరించారు. అనంతరం సీజేఐ నేతృత్వంలోని జస్టిస్‌ ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పలు కేసుల్ని విచారించింది.

ఇక రెండో నెంబరు కోర్టు గదిలో జస్టిస్‌ చలమేశ్వర్‌ పలు కేసుల్ని విచారించారు. జస్టిస్‌ గొగొయ్, జస్టిస్‌ లోకూర్, జస్టిస్‌ జోసఫ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు కోర్టు గదుల్లో కేసుల విచారణను కొనసాగించారు.  మరోవైపు, మంగళవారం సాయంత్రం జస్టిస్‌ జే చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు భేటీ అయ్యారు. అయితే వారి మధ్య చర్చల సారాంశం తెలియరాలేదు. బుధవారం కూడా నలుగురు న్యాయమూర్తులు సీజేఐతో సమావేశమవుతారని సుప్రీం వర్గాలు పేర్కొన్నాయి.   

మరిన్ని వార్తలు