అర్ధరాత్రి.. ఎస్పీ ఔదార్యం

26 Dec, 2017 09:38 IST|Sakshi
పర్యాటకుల కారును రిపేర్‌ చేసేందుకు స్పానర్‌ పట్టిన ఎస్పీ అణ్ణామలై

చిమ్మచీకటి.. దట్టమైన అడవిలో పర్యాటకులకు చేయూత

సాక్షి, బెంగళూరు (చిక్‌మగళూరు): ఆయనో జిల్లాకు పోలీస్‌ బాస్‌.. కానీ చిమ్మ చీకట్లో, దట్టమైన అడవి మధ్య పర్యాటక బృందం వాహనానికి పంక్చర్‌ అయితే స్వయంగా మరమ్మతుకు యత్నించారు. కుదరకపోవడంతో వారిని డ్రాప్‌ చేశారు.. ఆ వ్యక్తి మరెవరో కాదు కర్ణాటకలో చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ అణ్ణామలై.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన కొందరు పర్యాటకులు వారాంతంలో చిక్కమగళూరు పర్యటన ముగించుకుని శృంగేరి రహదారిలో ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో వారి వాహనానికి మత్తావర గ్రామ సమీపంలో పంచర్‌ కావడంతో నిలిచిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతం.. చిమ్మచీకటిగా ఉండడంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.

అదే సమయంలో కొప్ప గ్రామంలో తన పర్యటనను ముగించుకుని చిక్కమగళూరు వెళ్తున్న ఎస్పీ అణ్ణామలై వారి పరిస్థితిని గమనించి తన వాహనాన్ని నిలిపారు. తానే స్వయంగా స్పానర్‌ చేతబట్టి టైర్‌ మార్చేందుకు ప్రయత్నించారు. అయితే, చాలాసేపు ప్రయత్నించినప్పటికీ టైర్‌ మార్చేందుకు వీలుకాకపోవడంతో ఒక మెకానిక్‌కి ఫోన్‌చేసి కారును రిపేర్‌ చేయాల్సిందిగా కోరారు. అనంతరం పర్యాటకుల బృందాన్ని చిక్‌మగళూరులో విడిచి వెళ్లారు.

మరిన్ని వార్తలు