పాఠశాలలో ఎన్నికల ప్రచారంపై ఫైర్‌

30 Jan, 2019 09:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌కు లేఖ రాసింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఎన్‌సీపీసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారానికి రావడంతో చిన్నారుల చదువులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. స్కూలు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రచార సభలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. పాఠశాలలోకి వచ్చే విజిటర్ల గుర్తింపును, ఏ ఉద్దేశంతో స్కూల్‌కు వస్తున్నారో తెలుసుకుని మెయిన్‌ గేట్ల వద్ద ప్రవేశ రిజిస్టర్లలో నమోదు చేశాకే సందర్శకులను అనుమతించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కార్‌కు రాసిన లేఖలో ఎన్‌సీపీసీఆర్‌ కోరింది.

సర్వోదయ కన్యావిద్యాలయ పాఠశాలల్లో 11,000 నూతన తరగతులకు సోమవారం శంకుస్ధాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం సిసోడియాలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరడం దుమారం రేపింది. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ఇష్టపడతారా లేకుంటే మీ పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారా అని తల్లితండ్రులను వారు ప్రశ్నించారు. మీ పిల్లల్నే మీరు ప్రేమిస్తే వారి అభ్యున్నతికి పనిచేసే వారికే ఓటేయాలని పిలుపు ఇచ్చారు. మీరు మీ పిల్లలను ఇష్టపడకుంటే మోదీకే ఓటు వేయాలని సలహా ఇచ్చారు. మోదీ పాఠశాలల్లో ఒక క్లాస్‌రూమ్‌ను సైతం నిర్మించలేదని వారు ఆరోపించారు.

మరిన్ని వార్తలు