చిన్నారుల అక్రమ రవాణాపై కేంద్రం నిర్లక్ష్యం: సుప్రీం

30 Jan, 2015 03:34 IST|Sakshi
చిన్నారుల అక్రమ రవాణాపై కేంద్రం నిర్లక్ష్యం: సుప్రీం

న్యూఢిల్లీ: చిన్నారుల అక్రమ రవాణా, వ్యభిచారాలను నిరోధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు గురువారం ఆక్షేపించింది. ఆ దారుణాలను అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన చర్యల వివరాలు తెలుసుకోవాలంటూ తామిచ్చిన ఆదేశాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసేందుకే కేంద్రానికి నెల రోజులకు పైగా సమయం పట్టిందని విమర్శించింది.
 
  గత సంవత్సరం అక్టోబర్ 30న తాము ఆదేశాలిస్తే డిసెంబర్ 12న.. నెల రోజుల తరువాత రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని పంపించారని జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన సమాచారం ఇవ్వని రాష్ట్రాలపై తీసుకున్న చర్యలనూ కేంద్రం కోర్టుకు తెలియపర్చలేదని పేర్కొంది. వ్యభిచారం పేరుతో లైంగిక దోపిడికి గురైన బాధితుల కోసం ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రొటోకాల్’ను ఏర్పాటు చేయాలన్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ చేసిన సూచనలపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు