చిన్నారుల హెల్ప్‌లైన్‌కు పోటెత్తిన ఫిర్యాదులు

8 Apr, 2020 19:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 24న మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం కేవలం 11 రోజుల్లోనే చైల్డ్‌లైన్‌ ఇండియా హెల్ప్‌లైన్‌కు 92,000 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, హింసను ఎదుర్కొంటున్న చిన్నారులు హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. చైల్డ్‌లైన్‌ 1098కి మార్చి 20 నుంచి 21 వరకూ మూడు లక్షల కాల్స్‌ రాగా, అందులో 30 శాతం 92,105 కాల్స్‌ వేధింపులు, హింసకు సంబంధించినవని చైల్డ్‌లైన్‌ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ హర్లీన్‌ వాలియా వెల్లడించారు. ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేసిన అనంతరం తమ హెల్ప్‌లైన్‌కు 50 శాతం మేర కాల్స్‌ పెరిగాయని తెలిపారు.

లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో చిన్నారులపై ఒత్తిడి తగ్గే మార్గాలపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చర్చించామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో వేధింపులతో పాటు ఆరోగ్యం బాగాలేదని 11 శాతం కాల్స్‌, బాలకార్మికులపై 8 శాతం, అదృశ్యమైన, పారిపోయిన చిన్నారులపై 8 శాతం, అనాధ చిన్నారుల గురించి 5 శాతం కాల్స్‌ వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనావైరస్‌పై 1677 కాల్స్‌ వచ్చాయని, 237 మంది తమకు అస్వస్థతగా ఉందని సాయం చేయాలని హెల్ప్‌లైన్‌ను సంప్రదించారని పేర్కొన్నారు. కాగా లాక్‌డౌన్‌ సందర్భంగా ఇళ్లకు పరిమితమైన భర్తలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళలు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం గృహహింస ఫిర్యాదులు పెరిగాయని, ఈమెయిల్‌ ద్వారానే 69 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు.

చదవండి : సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు

మరిన్ని వార్తలు