అసభ్య ఫొటోలు షేర్‌ చేస్తోన్న పిల్లలు

31 Dec, 2019 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని అమాయక పిల్లలుగా మనం భావిస్తుంటే వారేమో సోషల్‌ మీడియా పుణ్యమా అని అన్నీ తెలిసిన పెద్దల వలే చెడు మార్గాన పయనిస్తున్నారు. పట్టుమని 14 ఏళ్లు కూడా లేని బాల బాలికలు సోషల్‌ మీడియాలో నగ్న ఫొటోలను షేర్‌ చేయడంతోపాటు లైంగిక పరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అలా గత రెండేళ్లుగా ఇంగ్లండ్, వేల్స్‌లో బాల ప్రేప పురాణం సాగిస్తున్న 6000 మందికిపైగా పిల్లలను 27 పోలీసు దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పసిగట్టాయి. వారిలో 306 మంది పదేళ్లలోపు బాల బాలికలవడం మరింత ఆశ్చర్యం. 

ఇంగ్లండ్, వేల్స్‌ దేశాల్లో 14 ఏళ్లలోపు పిల్లలు ఇలా వ్యవహరించడం నేరం. 2017, జనవరి నెల నుంచి 2019, ఆగస్టు నెల మధ్య ఒకరికొకరు నగ్న ఫొటోలను పంపించుకోవడంతోపాటు తమ ఫాలోవర్లయిన ఇతరులకు అలాంటి ఫొటోలను పంపించిన 6,499 మంది పిల్లలను గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిలో ఆరేళ్ల వయస్సు గల పిల్లలు 17 మంది ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించినట్లు వారు చెప్పారు. వారిలో ఒక్కొక్కరు నెలకు కనీసంగా 183 నుంచి గరిష్టంగా 241 అసభ్య ఫొటోలను పంపించారని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు వారిలో 9 ఏళ్ల బాలిక తన అసభ్య ఫొటోలను ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేయగా, అంతే వయస్సు గల బాలుడు తన నగ్న సెల్ఫీని ‘ఫేస్‌బుక్‌’లో షేర్‌ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంగ్లండ్, వేల్స్‌ చట్టాల ప్రకారం పదేళ్లు నిండిన పిల్లలే శిక్షార్హులవుతారు. 

అంతే కాకుండా వారి భవిష్యత్తును పరిరక్షించడంలో భాగంగా 30 మంది పిల్లలపైనే చార్జిషీటు దాఖలు చేసి మిగతా పిల్లలందరిని హెచ్చరికలతో వదిలేశామని పోలీసు అధికారులు తెలిపారు. చార్జిషీటు దాఖలయిన పిల్లలను కూడా కోర్టు హెచ్చరికల ద్వారాగానీ, కౌన్సిలింగ్‌ ద్వారాగానీ విడుదల చేయవచ్చని వారు చెప్పారు. నగ్న చిత్రాలు పరస్పర ఆమోదంతో షేర్‌ చేసుకున్నట్లయితే కూడా తాము జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పైగా ఈ పిల్లల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల్లో ఏ వర్గం నుంచి కూడా తమకు ఒత్తిడి లేదని నార్‌ఫోక్‌ కానిస్టేబుల్‌ చీఫ్‌ సైమన్‌ బైలే తెలిపారు. 

మరిన్ని వార్తలు