బలవుతున్న బాల్యం..

12 Jun, 2016 19:16 IST|Sakshi
బలవుతున్న బాల్యం..

ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా నేటి తరంలో బాలకార్మిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం..

21 కోట్ల మంది..
కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.

కారణాలు..
పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్‌ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు.

బాల్యం ఛిద్రం..
బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వీరిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్ధా్యనికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.

భవిష్యత్‌ అంధకారం..
బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు. ఇందుకు వ్యవస్థనే తప్పుబట్టాల్సి ఉంటుంది.

నిర్మూలనకు మార్గం..
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. దీనికి అనుగుణమైన చట్టాలు రూపొందించాలి. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలి. బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలి. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చు. ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచిత విద్య, భోజనం అందిచాలి. తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలి.

మన దేశంలో..
ప్రపంచంలో ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోంది. దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోంది. ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోంది. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారు.

యునిసెఫ్‌ కృషి..
అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునిసెఫ్‌ సంస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యత్నిస్తోంది. వివిధ దేశాలతో కలిసి ఈ సమస్య నివారణ కోసం చట్టాలు రూపొందించింది. 15 ఏళ్లలోపు పిల్లల్ని ఎక్కడా పనుల్లో చేర్చుకోకూడదని, 18 ఏళ్లలోపు వారిని కఠినమైన పనులకు వినియోగించకూడదని యునిసెఫ్‌ నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలందరికీ కచ్చితంగా విద్య అందేలా చూస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో, ప్రాథమిక విద్య అందించడంలో యునిసెఫ్‌ కీలకపాత్ర పోషిస్తోంది.

మరిన్ని వార్తలు