ఉపసంహరణ దాదాపు పూర్తి 

9 Jul, 2020 07:01 IST|Sakshi

హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద ఉన్న పీపీ 15 నుంచి కూడా వెనక్కు వెళ్లిన చైనా బలగాలు 

న్యూఢిల్లీ:  భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతం నుంచి చైనా దళాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగాయి. శిబిరాలను తొలగించాయి. సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సాధ్యమైనంత త్వరగా, దశలవారీగా బలగాల ఉపసంహరణ జరగాలని నిర్ణయించారు. దాంతో సోమవారం నుంచి గల్వాన్‌ లోయ, హాట్‌స్ప్రింగ్స్, గొగ్రా, పాంగాంగ్‌ సొలోని ఫింగర్‌ ఏరియాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి ఇప్పటికే చైనా వెనక్కు వెళ్లింది.

హాట్‌ స్ప్రింగ్‌ వద్ద ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 నుంచి బుధవారం నాటికి చైనా బలగాలు పూర్తిగా వైదొలగాయని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఉపసంహరణ ఏ మేరకు జరిగిందనే విషయాన్ని భారత దళాలు త్వరలో ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ధారించుకుంటాయని తెలిపాయి. మరోవైపు, ఉపసంహరణ ప్రక్రియ అమలును భారత్, చైనా సైన్యాధికారులు సంయుక్తంగా పరిశీలించి, నిర్ధారించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది.

గొగ్రా(పెట్రోలింగ్‌ పాయింట్‌ 17ఏ) నుంచి చైనా దళాలు గురువారం నాటికి వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నాయి. సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో హాట్‌ స్ప్రింగ్స్, గొగ్రా ఉన్నాయి.  జూన్‌ 30న ఇరుదేశాల కమాండర్‌ స్థాయి చర్చల్లో..   ఘర్షణలకు అవకాశమున్న ప్రదేశాల్లో కనీసం 3 కిమీల వరకు బఫర్‌ జోన్‌(నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. 

మరిన్ని వార్తలు