సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే దిశగా చైనా చర్యలు 

22 Jul, 2020 20:05 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంట భారత్‌-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్‌ కమాండర్ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సైనిక ఉపసంహరణ గురించి చర్చలు జరిగాయి. కానీ చైనా వీటిని ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. తాజాగా చైనా ఎల్‌ఏసీ వెంబడి 40 వేల మంది సైనికులను మోహరించింది. డ్రాగన్‌ దేశం చర్యలను చూస్తే.. ఉద్రిక్తతలను తగ్గించే ఆలోచన ఏమాత్రం లేనట్లు అర్థమవుతుంది అంటున్నారు అధికారులు. వాయు రక్షణ వ్యవస్థలు, సాయుధ సిబ్బంది, సుదూర ఫిరంగిదళాలు వంటి భారీ ఆయుధాల మద్దతు ఉన్న దాదాపు 40,000 మంది సైనికులను మోహరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.(బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?)

గత వారం జరిగిన రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలానే చైనా ఫింగర్‌ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్దంగా లేదు. అంతేకాక ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అందువల్ల చైనా తన శాశ్వత స్థానం సిర్జాప్‌కు వెళ్లడానికి సిద్ధంగా లేదు. అంతేకాక తూర్పు లద్దాఖ్‌లోని రెండు ప్రధాన ఉద్రిక్త ప్రాంతాలైన హాట్‌ స్ప్రింగర్స్‌, గోర్జా పోస్ట్‌ ప్రాంతాల్లో చైనా భారీ మొత్తంలో నిర్మాణాలు చేస్తోంది. ఈ రెండు ప్రాంతాల నుంచి తాము వెనక్కి వెళ్తే భారత్‌ సరిహద్దు వెంబడి తమ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందనే సాకును ముందు పెడుతుంది చైనా.

మరిన్ని వార్తలు