పాక్‌ కాదు.. చైనానే డేంజర్‌: శరద్‌ పవార్‌

12 Jul, 2020 16:21 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్‌ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. ఆయన శివసేన పత్రిక 'సామ్నా' ఇంటర్వ్యూలో దేశ బధ్రకు సంబంధించిన అంశాలపై విశ్లేషించారు. దేశానికి ప్రథమ శత్రువు పాకిస్తాన్‌ అని అందరు భావిస్తారు కానీ, పాక్‌ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. చైనా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌లు షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వడం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కావని అన్నారు.అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, చైనాను అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి, దేశ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

గత కొన్ని రోజులుగా భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చైనా పాక్‌ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని,  నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్‌ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్‌ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ద్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముఖ్య అంశాలలో సైతం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని శరద్‌ పవార్‌ విమర్శించారు. (చదవండి: నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శ‌ర‌ద్ ప‌వార్)

>
మరిన్ని వార్తలు