చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి

23 Jun, 2020 15:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

షీ జిన్‌పింగ్‌కు ముందే తెలుసన్న అమెరికా ఇంటెలిజెన్స్

వాషింగ్టన్: అనుకున్నదంతా నిజమే. పక్కా ప్రణాళికతోనే చైనా, భారత జవాన్లపై దాడికి ఒడిగట్టింది. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు దాడికి వ్యూహం పన్నింది. అదును చూసి తన సైన్యాన్ని ఉసిగొలిపింది. ఓ సీనియర్ జనరల్ స్థాయి అధికారి భారత జవాన్లపై దాడి చేయాలని ఆదేశాలిచ్చినట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ మంగళవారం వెల్లడించింది. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?)

ప్రపంచదేశాల ముందు చైనా బలహీనంగా కనిపించకుండా ఉండాలంటే ‘ఇండియాకు గుణపాఠం చెప్పాలి’ అనే ఉద్దేశంతోనే చైనా ఈ దాడికి దిగినట్లు సమాచారం. చైనాకు చెందిన జనరల్ ఝావో ఝాంగ్ కీనే స్వయంగా ఈ దాడి చేయాలని ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కు ముందుగానే సమాచారం అందిందని తెలిపింది. (సేనల ఉపసంహరణకు పరస్పర అంగీకారం)

ఝాంగ్ కీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)లో సీనియర్ జనరల్. 1979 వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. 2017 డొక్లాం ఘటనను కూడా పర్యవేక్షించారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలకు, చైనాకు మధ్య పూడ్చుకోలేని అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితులను వాడుకుని అమెరికా, భారత్‌ను తన పక్షాన చేర్చుకుంటుందని ఝాంగ్ భావించినట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే గల్వాన్ లోయలో చైనా దాడికి దిగింది. భారత జవాన్లు ప్రతిదాడికి దిగడంతో నివ్వెరపోయింది.

ఓ కమాండర్ స్థాయి అధికారిని పోగొట్టుకుని పరువు బజారుకి ఈడ్చుకుంది. ఈ అధికారి అంత్యక్రియల్లో సైతం ఝావో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలను చైనా మీడియా ప్రచురించగా, వాటిని తొలగించే పనిలో చైనా ఇంటెలిజెన్స్ పడిందని అమెరికన్ ఇంటెలిజెన్స్ తెలిపింది.

>
మరిన్ని వార్తలు