‘డోక్లామ్‌’ సవాలుకు సిద్ధం: భారత్‌

13 Aug, 2017 01:26 IST|Sakshi

జమ్మూ: డోక్లామ్‌ ప్రతిష్టంభనకు సంబంధించి చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత్‌ పూర్తి సన్నద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు చేపడుతున్న చర్యల పట్ల భారత్‌ విశ్వాసంతో ఉందని చెప్పారు. ఈ మధ్య కాలంలో చైనా మీడియా నుంచి వెలువడుతున్న వరస ప్రకటనలను కొట్టిపారేశారు.

సిక్కిం సెక్టార్‌లో భారత్‌ తన బలగాలను వెనక్కి పిలవాలని చైనా హెచ్చరించడంపై స్పందిస్తూ...‘మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎదుటి పక్షం నుంచి వస్తున్న ట్వీట్లపై మాట్లాడానికి ఇక్కడి రాలేదు. మా చర్యలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని అన్నారు. భారత్‌–పాక్‌ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనకు భారత్‌ తగిన రీతిలో బదులిస్తోందని పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలో యువత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని మిలిటెంట్‌ జకీర్‌ మూసా చిత్రంతో కూడిన పోస్టర్లు వెలుగుచూడటంపై మాట్లాడుతూ..అలాంటి పోస్టర్లు గతంలోనూ కనిపించాయని అన్నారు.  

‘భారత్‌ పరిణతితో వ్యవహరిస్తోంది’
వాషింగ్టన్‌: డోక్లామ్‌పై భారత్‌ పూర్తి పరిణతితో, చైనా అసహనంతో వ్యవహరిస్తోందని అమెరికా రక్షణ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. అమెరికా నేవీ కళాశాల ప్రొఫెసర్‌ హో మ్స్‌ స్పందిస్తూ వివాదాన్ని చైనా సుదీర్ఘకాలం కొనసాగించాలని కోరుకుంటోందన్నారు.

మరిన్ని వార్తలు