జైషే చీఫ్‌పై మారని చైనా తీరు

15 Feb, 2019 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన ఘటనను చైనా ఖండిం‍చినప్పటికీ ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్‌ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.

పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్‌ షౌంగ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి సుస్ధిరతలను పరిరక్షించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే అంశంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ను ఐరాస భద్రతా మండలి కౌంటర్‌-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు