భారత్‌ వ్యతిరేకత.. చైనా ఆశ్చర్యం

1 Jul, 2020 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం డోక్లాంలో భారత సైన్యం.. ఇండియా-చైనా-భూటాన్‌ ట్రై జంక్షన్‌ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. అయితే భారత్‌ చర్యలకు చైనా ఆశ్చర్యపోయిందని.. ఇండియా తమను సవాలు చేయడం ఏంటని చైనా షాక్‌కు గురయ్యిందని ఆ దేశ నిపుణురాలు, అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్‌లో ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం సహ డైరెక్టర్ యున్‌ సన్‌ తెలిపారు. మన దేశానికి చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాక అప్పటి నుంచి చైనా వ్యూహాల్లో మార్పు వచ్చిందని..  భారత్‌తో పరస్పరం చర్చలు జరపడానికి ముందుకు రావడం దానిలో భాగమే అన్నారు యున్‌ సన్‌. భారత్‌, చైనా మధ్య 2017లో డోక్లాం ప్రతిష్టంభన గురించి యున్ సన్ మాట్లాడుతూ.. ‘2017లో డోక్లాం వివాదం చైనాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే భారతదేశం తనను వ్యతిరేకిస్తుందని.. దాదాపు 72-73 రోజుల పాటు వివాదం నడుస్తుందని చైనా ఊహించలేదు. అది కూడా భూటాన్‌ సమీపంలోని బంజరు భూమి కోసం భారత్‌ తనను వ్యతిరేకిస్తుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది చైనాకు షాక్‌ లాంటిదే’ అన్నారు యున్‌ సన్‌. (నిషేధంతో చైనా గుబులు)

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట తూర్పు లడాఖ్‌లో కొనసాగుతున్న చైనా తాజా దురాక్రమణ గురించి యున్‌ సన్‌ను ప్రశ్నించగా.. ‘సరిహద్దు సమీపంలో భారతదేశం  కార్యకలాపాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చైనా అధికారులు భావించారు. దీని గురించి మీరు ఒక చైనా ప్రభుత్వ అధికారిని అడిగితే .. వారి సమాధానం ఎలా ఉంటుందంటే.. ‘వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం చర్యలు మాకు అంగీకారం కావు. వాటిపై చైనా స్పందిస్తోంది’ అని సమాధానమిస్తారు’ అన్నారు యున్‌ సన్‌. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఎల్‌ఏసీ వెంబడి ఉన్న ప్రదేశాల గురించి ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతుందని తెలిపారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సై అంటే సై!)

అంతేకాక ‘భారతదేశం తమ ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని చైనీయులు గుర్తించినప్పుడు ఎలా స్పందించాలి అనేది వారి ఇష్టం. భారతదేశం తమను వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావించారు. ప్రస్తుతం భారతదేశం చైనాను ఒక అసాధారణస్థితిలో పెడుతోంది. అలాంటప్పుడు చైనా దూకుడుగా స్పందించి భారతదేశంపై దాడి చేయాలి.. లేదా ఏమి చేయకుండా భూభాగాన్ని వదులుకోవాలి’ అని యున్ సన్ అన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా