భారత్‌ మార్కెట్‌లోకి డేంజరస్‌ ‘డ్రగ్‌’

6 Oct, 2017 18:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మార్ఫిన్‌ లేదా హెరాయిన్ల కన్నా వంద రెట్లు శక్తివంతమైనది, అంతకంటే ప్రమాదకరమైన డ్రగ్‌ ‘చైనా వైట్‌’ మయన్మార్‌ మీదుగా భారత్‌ నార్కోటిక్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. దేశ రాజధానిలోని యువత ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతుండడంతో స్మగ్లర్లు మయన్మార్‌ నుంచి  మిజోరమ్, మణిపూర్‌ల మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నారు. దీని అధిక డోస్‌ కారణంగా కెనడాలో ఇప్పటికే రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు. మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ డ్రగ్‌ భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

హెరాయిన్‌ తరహాలోనే దీన్ని కూడా ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్‌ ద్వారా రక్తంలోకి ఎక్కించుకుంటారు. చైనా వైట్‌గా పిలిచే ఈ డ్రగ్‌ను ఫెంటానిల్‌ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. మయన్మార్‌ నుంచి వచ్చిన ఈ డ్రగ్‌ను మిజోరమ్‌లో బుధవారం పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు నగరంలో 12 కిలోల చైనా వైట్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 50 కోట్ల రూపాయలు ఉంటుంది.

మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్‌ మధ్యనున్న గోల్డెన్‌ ట్రయాంగిల్‌ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్‌ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది.

సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్‌ వస్తువుల ద్వారా ఈచైనా వైట్‌ డ్రగ్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమాన మార్గాల్లో కూడా వస్తున్నట్లు తెల్సింది. గసగసాలకు ఫెంటానిల్‌ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్‌ను కలిపి చైనా వైట్‌ను తయారు చేస్తున్నట్లు తెల్సింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్‌ గాయకుడు ప్రిన్స్‌ కూడా ఈ డ్రగ్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క 2016లోనే అమెరికాలో 20,100 ఈ డ్రగ్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు