చైనా 'బస్సు'పై.. మోదీ ఆరా

7 Aug, 2016 13:20 IST|Sakshi
చైనా 'బస్సు'పై.. మోదీ ఆరా

పెరుగుతున్న జనభాతోపాటూ మన దేశంలో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం వల్ల విలువైన శిలాజ ఇంధనం ఖర్చు అవడమేగాకుండా వాయుకాలుష్యానికి దారితీస్తోంది. ఈ సమస్యకు చెక్ చెప్పే విధంగా తాజాగా చైనా ఓ భారీ బస్సుకు రూపకల్పన చేసింది. ఇటీవలే ఈ బస్సును విజయవంతంగా ట్రయల్ రన్ను కూడా పూర్తి చేసుకుంది. దీంతో బ్రెజిల్, ఇండోనేసియా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో పాటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని కూడా ఈ బస్సు ఆకర్షించింది.

ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. అత్యంత రద్దీగా ఉండే మన దేశంలోని నగరాల రోడ్లకు ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్లు అనువుగా ఉంటాయో లేదో విశ్లేషించి నివేదిక అందించాని అధికారులకు సూచించారు. నేషనల్ హైవేకారిడార్లలో ట్రాఫిక్ నియంత్రణ అంశంపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో మోదీ చర్చిస్తున్న సమయంలో ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ల ప్రస్తావన వచ్చింది.

ఈ బస్సులో ఎన్నో విశేషాలు..
ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడుతూ, భవిష్యత్ రవాణా రంగాన్నే మలుపుతిప్పగల కొత్త బస్సును చైనా ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ (టీఈబీ-1) పిలిచే ఈ భారీ బస్సును ఉత్తర చైనాలోని హ బెయి ప్రావిన్స్‌లోని కిన్‌హువాంగ్‌డావో నగరంలో టెస్ట్ రన్ నిర్వహించారు. 25 అడుగుల వైశాల్యమున్న ఈ బస్సు రోడ్డు నుంచి దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మిగతా వాహనాలు అవలీలగా ఈ బస్సుకింద నుంచి ప్రయాణం చేయవచ్చు. ఈ బస్సు ఆగేందుకు ప్రత్యేకమైన బస్సుబేలను ఏర్పాటు చేశారు. రోడుకిరువైపులా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా ఈ బస్సు ప్రయాణిస్తుంది. ఒకేసారి నాలుగు బస్సు కోచ్‌లను కలపడం ద్వారా దాదాపు 1400 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. బస్సు లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా సీట్లు, మధ్యలో రౌండ్ సీట్లతో కంపార్టుమెంట్ చాలా స్టైలిష్ లుక్‌తో ఉంది. ట్రాఫిక్ అవసరాల్ని తీర్చేందుకు నగరాల్లో ఇప్పటికే నెలకొల్పిన మెట్రో రైల్, సబర్బన్ రైళ్లతో పోలిస్తే అత్యంత చౌకగా ఈ బస్సుల్ని తయారు చేయవచ్చు.

ఎలా పనిచేస్తుంది..
విద్యుత్తుతో పని చేసే ఈ బస్సును, సాధారణ రోడ్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గం ద్వారా నడిపిస్తారు. దాదాపు ఈ బస్సు ఒక సబ్‌వేలాగా పనిచేస్తుందని ఈ బస్సు ప్రాజెక్టు ఇంజనీర్ బాయి జిమింగ్ పేర్కొన్నారు. అయితే సబ్‌వే నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో కేవలం ఐదోవంతుతోనే ఈ బస్సును రూపొందించవచ్చని తెలిపారు. దాదాపు 40 బస్సుల్లో ప్రయాణించేంత మంది ఈ బస్సులో ఒకసారి ప్రయాణించవచ్చు.

ఎప్పుడు రూపొందించారు..
ఇలాంటి బస్సుల్ని తయారుచేయాలని చాలా మంది ఔత్సాహికులకు తీవ్రంగా పరిశోధనలు చేశారు. అయితే సంగ్ యిజూ అనే డిజైనర్ ఈబస్సును రూపొందించారు. గత మేలో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన 19వ హైటెక్ ఎక్సోపోలో తొలిసారిగా ఈమోడల్‌ను తొలిసారిగా ప్రదర్శించారు. ఈ ఆగస్టులో టెస్టురన్ ఉంటుందని అప్పుడే నిర్వాహకలు ప్రకటించారు. బుధవారం దిగ్విజయంగా ఈ బస్సును టెస్టురైడ్ చేశారు. ఇందుకోసం క్విన్‌హువాంగ్‌డావో నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గంలో ఈ బస్సును నడిపిచూశారు. గంటకు 60 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ బస్సు భవిష్యత్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ టెస్టురన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా గమనించింది. పలు సామాజిక మాధ్యమాల్లో దీనిపై విశేష చర్చ జరిగింది. టెస్టురన్ విజయవంతం కావడంతో చైనాలోని మరిన్ని ప్రావిన్స్‌ల్లో ఈ బస్సుల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయాత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు