ఐటీ, బ్యాంకింగ్ రంగాల‌పై 40,000కు పైగా సైబ‌ర్ అటాక్స్

24 Jun, 2020 10:39 IST|Sakshi

ముంబై :  చైనాకు చెందిన హ్యాకర్లు  గ‌త ఐదు రోజుల్లో ఐటీ,  బ్యాంకింగ్ రంగాల‌పై న‌ల‌భై వేల‌కు పైగానే  సైబర్ దాడులకు ప్రయత్నించారని మహారాష్ట్ర పోలీసు సైబర్ వింగ్ అధికారి  యశస్వి యాదవ్  మంగ‌ళ‌వారం తెలిపారు.  తూర్పుల‌ద్ధాఖ్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆన్‌లైన్ దాడులు జరిగిన‌ట్లు పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను హైజాక్ చేయడం, ఫిషింగ్ వంటి సమస్యలను సృష్టించే లక్ష్యంతో ప్ర‌ధానంగా ఈ  దాడులు జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. గ‌త ఐదు రోజుల్లోనే భారత సైబర్‌స్పేస్‌లోని వివిధ వన‌రుల‌పై దాదాపు 40,300 సైబ‌ర్ దాడులు జ‌రిగిన‌ట్లు య‌శ‌స్వి యాద‌వ్ వెల్ల‌డించారు.  చైనాలోని చెంగ్డు ప్రాంతం నుంచే ఎక్కువ‌గా సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు. (వాస్తవాధీన రేఖ నిర్థారణ అసాథ్యమేమీ కాదు.. )

 భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఆన్‌లైన్ నేరాలు జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఇక వాస్త‌వాదీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే దిశ‌గా భార‌త్, చైనా దేశాలు కీల‌క‌మైన ముందడుగు వేశాయి. తూర్పు ల‌ద్ధాఖ్‌లోని అన్ని వివాదాస్ప‌ద‌, ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్ర‌దేశాల నుంచి వెనుదిర‌గాల‌ని ఏకాభిప్రాయానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేలా ఇరు దేశాలు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  (రష్యాలో వారిద్దరు భేటీ కావడం లేదు: భారత్‌ )


 

మరిన్ని వార్తలు