వెనక్కి తగ్గిన చైనా

7 Jul, 2020 02:37 IST|Sakshi
వాంగ్‌ యితో ధోవల్‌ (ఫైల్‌)

సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు తొలి అడుగు

పీపీ 14లో శిబిరాల తొలగింపు

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్‌లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్‌ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో ధోవల్‌ ఆదివారం ఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు.

బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్‌ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్‌ 15 నాటి గల్వాన్‌ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం.

సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్‌ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్‌ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది.

దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్‌ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్‌ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్‌ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది.

పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు..
పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్‌ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్‌ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం..  చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి.

సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు