ప్లే స్టోర్‌లో రికార్డు సృష్టిస్తోన్న చింగారీ

3 Jul, 2020 11:56 IST|Sakshi

బెంగళూరు: భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59‌ యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు చైనీస్ యాప్స్ వాడినవారంతా ప్రత్యామ్నాయ యాప్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ స్థానంలో భారతదేశానికి చెందిన 'చింగారీ' యాప్ డౌన్‌లోడ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్‌లోనే కోటి డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. గత పదిరోజుల్లో ఈ యాప్‌ను 30 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా.. గడిచిన 72 గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేశారు. (దేశీ యాప్స్‌ హుషారు..)

బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది 'చింగారీ' యాప్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ అయిన్‌ ‘చింగారీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. చైనాకు చెందిన యాప్స్‌ని నిషేధించాలన్న వాదన మొదలైన దగ్గర్నుంచీ 'చింగారీ' యాప్‍కు యూజర్లు పెరిగారు. గత కొన్ని రోజులుగా సబ్‌స్క్రైబర్స్ 400 శాతం పెరిగారు. ఈ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేయొచ్చు. స్నేహితులకు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చాట్‌ చేయడంతో పాటు కొత్త వారితో ఇంటరాక్ట్ కూడా కావొచ్చు’ అని తెలిపారు. ‘చింగారీ’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బంగ్లా, మళయాళం లాంటి భాషల్లో ఉపయోగించొచ్చు.(టిక్‌టాక్‌కు చెక్ పెట్టే ఇండియ‌న్ యాప్‌)

>
మరిన్ని వార్తలు