లైంగిక వేధింపుల కేసు : చిన్మయానంద్‌ అరెస్ట్‌

20 Sep, 2019 10:38 IST|Sakshi

షహజన్‌పూర్‌ : తాను నిర్వహించే కాలేజ్‌లో చదివిన వైద్య విద్యార్ధినిచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ (73)ను శుక్రవారం సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. చిన్మయానంద్‌ను పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరచగా న్యాయస్ధానం ఆయనను 14 రోజుల పాటు జైలుకు తరలించింది. అనారోగ్య కారణాలతో చిన్మయానంద్‌ గురువారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్ధలు నడుపుతూ రాజకీయ ప్రాబల్యం కలిగిన చిన్మయానంద్‌పై బాధితురాలు నెలరోజుల కిందటే ఫిర్యాదు చేసినా ఆయనపై చాలా రోజుల వరకూ లైంగిక దాడి కేసు నమోదు చేయలేదు.

సుప్రీం కోర్టు జోక్యంతో కేసులో కదలిక రాగా, సోమవారం భారీ భద్రత నడుమ బాధితురాలు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీలో అడ్మిషన్‌ ఇచ్చేందుకు సాయపడిన చిన్మయానంద్‌ తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాలేజ్‌ హాస్టల్‌లో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసి చిన్మయానంద్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. స్వామి పాడుబుద్ధిని బయటపెట్టేందుకు ఆధారాల కోసం తన కళ్లద్దాల్లో కెమెరా అమర్చి రికార్డు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చిన్మయానంద్‌పై పరోక్షంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన అనంతరం ఆగస్ట్‌ 24 నుంచి ఆమె అదృశ్యమయ్యారు. వారం తర్వాత యూపీ పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. మరోవైపు బాధితురాలి ఆరోపణలను పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్‌ విచారణకు ఆదేశించింది. బాధితురాలి హాస్టల్‌ గదిని పరిశీలించిన సిట్‌ బృందం గతవారం చిన్మయానంద్‌ను ఏడు గంటల పాటు ప్రశ్నించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా