‘సుశాంత్‌కు న్యాయం జరగాలి’

22 Jun, 2020 18:29 IST|Sakshi

మహారాష్ట్ర సీఎంకు పాశ్వాన్‌ లేఖ

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై విచారణ చేపట్టాలని లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ కోరారు. ముంబైలోని బాంద్రా నివాసంలో జూన్‌ 14న సుశాంత్‌ రాజ్‌పుట్‌ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ను బిహార్‌ ముద్దుబిడ్డగా అభివర్ణించిన చిరాగ్‌ పాశ్వాన్‌ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో సుశాంత్‌కు న్యాయం జరగాలని బిహార్‌ ఆకాంక్షిస్తుందని పేర్కొన్నారు.

బాలీవుడ్‌లో ఇక ముందు వర్గపోరు, బంధుప్రీతికి మరొక ప్రతిభ కలిగిన నటులెవరూ బాధితులుగా మారకుండా ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని బిహారీల తరపున కోరుతున్నానని పాశ్వాన్‌ అంతకుముందు ఠాక్రేతో ఫోన్‌లో స్పష్టం చేశారు. సుశాంత్‌ కుటుంబానికి సన్నిహితుడిగా అతడు కష్టపడి పనిచేసే ప్రతిభావంతుడని గుర్తుచేసుకున్నారు. కాగా బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ సోమవారం పట్నాలో సుశాంత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజ్‌పుత్‌ మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైందని, ఆయన మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని తివారీ డిమాండ్‌ చేశారు.

చదవండి : సుశాంత్‌ నెలఖర్చు ఎంతంటే..?

మరిన్ని వార్తలు