బుద్ధగయ పేలుళ్లను ఖండించిన చిరంజీవి

8 Jul, 2013 15:47 IST|Sakshi
చిరంజీవి

బుద్ధగయలో వరుస బాంబు పేలుళ్లను కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ఖండించారు. పేలుళ్లలో ఇద్దరు బౌద్ధ భిక్షువులు గాయడడం, ఆస్తి నష్టం జరగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ సహనంతో వ్యవహరించాలని కోరారు. గౌతమ బుద్ధుడు బోధించినట్టుగా మానవత్వంతో కూడిన సమాజస్థాపనకు కలిసికట్టుగా సాగాలని సూచించారు.

మరోవైపు వరుస బాంబు పేలుళ్ల కారణంగా బుద్ధగయలో ఏమేరకు నష్టం వాటిల్లిందో తెలుపుతూ నివేదిక సమర్పించాలని టూరిజం శాఖ అధికారులను చిరంజీవి ఆదేశించారు.

శాంతిదూత గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర క్షేత్రం బుద్ధగయకు ప్రపంచ దేశాల నుంచి బౌద్ధవులు తరలివస్తుంటారు. ఇక్కడి మహా బోధి ఆలయం 5-6 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించారు.
 

బీహార్ లోని బుద్ధగయలో ఆదివారం ఉదయం సంభవించిన 9 వరుస బాంబు పేలుళ్లలో ఇద్ధరు విదేశీ బౌద్ధ భిక్షువులు గాయపడ్డారు. మహా బోధి ఆలయం చెక్కు చెదరకపోవడం విశేషం. తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు