పెద్దల సభలో చిరంజీవికి భంగపాటు!

16 Jul, 2014 09:30 IST|Sakshi
పెద్దల సభలో చిరంజీవికి భంగపాటు!
మెగాస్టార్ గా తెలుగు సినీ తెరపై తనదైన శైలిలో డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి పెద్దల సభలో చేదు అనుభవం ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం దారుణమైన ఓటమి పాలైన తర్వాత మాజీ కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ పై తన గళాన్ని వినిపించారు.  
 
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాట్లాడేందుకు రాజ్యసభలో మూడు నిమిషాల పాటు సమయాన్ని చిరంజీవికి డిప్యూటీ చైర్మన్ కురియన్ కేటాయించారు. అయితే తనకు కేటాయించిన సమయాన్ని మించి ఏడు నిమిషాలపాటు ఏకధాటిగా తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ ను చదువుతుండగా కురియన్ ముగించాలని పదే పదే కోరారు. అయితే కురియన్ విజ్క్షప్తిని పట్టించుకోకుండా అదేపనిగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా చిరంజీవి చదివే తీరును కురియన్ అనుకరించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. అంతేకాకుండా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతున్నారని, సభలో గౌరవ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదని కురియన్ వ్యాఖ్యానించారు. కురియన్ స్పందనతోకొద్దిసేపు చిరంజీవి  తికమకపడ్డనట్టు కనిపించారు. అయితే సర్దుకుని ప్రసంగాన్ని ముగించి.. తనకు సమయాన్ని కేటాయించినందుకు సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి  అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం తెలిసిందే. అలాగే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
మరిన్ని వార్తలు