'ఛోటా' విన్నపాన్ని సర్కార్ మన్నించిందా!

6 Nov, 2015 06:50 IST|Sakshi
'ఛోటా' విన్నపాన్ని సర్కార్ మన్నించిందా!

న్యూఢిల్లీ: ఎక్స్టార్షన్,  స్మగ్లింగ్, మర్డర్స్ తదితర నేరాల నిర్వహణలో కరడుగట్టి.. రెండు దశాబ్ధాల కిందట భారత్ నుంచి పారిపోయి, విదేశాల నుంచే గ్యాంగ్ ను ఆపరేట్ చేస్తున్న మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను సీబీఐ ఐధికారులు శుక్రవారం ఉదయం భారత్ కు తీసుకొచ్చారు. బాలీ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి రాజన్ ను తరలించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్, సీబీఐ హెడ్ ఆఫీస్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజన్ ను విచారించున్న సీబీఐ హెడ్ ఆఫీస్ చుట్టూ 500 మీటర్ల మేర ఇతరులెవ్వరినీ అనుమతించడంలేదు.

కాగా, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రల్లో ఛాటన్ రాజన్ పై నమోదయిన అన్ని కేసులు సీబీఐకి బదలాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫడ్నవిస్ సర్కార్ కేంద్రానికి విన్నవించుకునే ప్రక్రియ కూడా ఆఘమేఘాల మీద పూర్తిచేసినట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం డాన్ ను ఈ రోజు ఉదయమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి ఛోటాను బాలి నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లిన అధికారుల బృందంలో సీబీఐతోపాటు ఢిల్లీ, ముంబై పోలీసు శాఖలకు చెందినవారు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఆదేశాలను బట్టి రాజన్ ను రెండు మహానగరాల్లో ఎటువైపైనా తీసుకుపోయేందుకు సంసిద్ధులయ్యారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వైపే మొగ్గుచూపటం గమనార్హం.

ఐదురోజుల కిందట బాలీలో మీడియాతో మాట్లాడిన ఛోటా రాజన్ ముంబై పోలీసులపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల్లో దావూద్ ఇబ్రహీం మనుషులు ఉన్నారని, అక్కడ తన ప్రాణాలకు ముప్పుందని, కాబట్టి తనను ముంబైకి తరలించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతణ్ని ఢిల్లీకి తీసుకొచ్చిన పరిణామాలను గమనిస్తే ఛోటా విన్నపాన్ని సర్కార్ మన్నించినట్లే భావిచొచ్చు.

భారత్‌లో రాజన్‌పై దాదాపు 80 కేసులు నమోదయ్యాయి. వీటిలో 70కిపైగా కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ఇతడిపై ఉగ్రవాద నిరోధక, మోకా చట్టాల కింద కూడా కేసులుండటం గమనార్హం. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాడ్ గా పనిచేసిన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి డీ-గ్యాంగ్ కు దూరమయ్యానని చెప్పుకున్నాడు. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీంను అంతం చేసేందుకు,  డీ- గ్యాంగ్ ఉగ్రవాద కార్యకలాపాల అడ్డుకట్టకు ఛోటా సహకరించాడని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే ఛోటా రాజన్.. 'దేశభక్త డాన్' అనే ఇమేజ్ నూ పొందినట్టు విశ్లేషకులు చెబుతారు.

మరిన్ని వార్తలు