ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన ఫాదర్

8 Sep, 2014 20:02 IST|Sakshi

చెన్నై: అమెరికాలో ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న  చర్చి ఫాదర్ జోసెఫ్ పళనివేల్ జయపాల్‌ను ఆ దేశానికి అప్పగించాలంటూ ఢిల్లీ కోర్టు కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి చెందిన ఫాదర్ జోసెఫ్ 2004-05లో అమెరికాలోని మిన్నసోట్టా నగర్‌లో ఉండేవాడు. అక్కడి చర్చికి వచ్చిన 14, 16 ఏళ్ల చిన్నారులపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అత్యాచారం సంఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురైన 14 ఏళ్ల బాలికను అక్కడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకాన్ని బయటకు చెబితే చిన్నారిని హతమారుస్తానని  ఫాదర్ బెదిరించినట్లు మరో ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలను ఖండించిన జోసెఫ్ 2005లో భారత్‌కు చేరుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అమెరికాలోని రెసివ్‌కవుండి కోర్టు ఫాదర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా 2010 డిసెంబరు 28న వారెంట్ జారీచేసింది. ఫాదర్‌ను అప్పగించాలని భారత విదేశాంగశాఖను అమెరికా కోర్టు  2011 ఫిబ్రవరిలో కోరింది. దీంతో విదేశాంగ శాఖ నవీన్‌ కుమార్ అనే ప్రత్యేక న్యాయవాదిని ఫాదర్ కేసు విషయమై నియమించింది. ఢిల్లీలోని అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఫాదర్‌పై నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవాలు ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడుతున్నదని ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్‌కార్క్ వ్యాఖ్యానించారు. కాబట్టి అత్యాచార ఆరోపణలపై ఏ దేశం విచారణ కోరుతోందో ఆ దేశానికి (అమెరికా) ఫాదర్ జోసెఫ్‌ను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేజిస్ట్రేటు ఆదేశించారు. ఫాదర్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అక్కడి చట్టాల ప్రకారం 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
**

మరిన్ని వార్తలు