స్కోరుంటేనే రుణం!

7 Jan, 2017 06:57 IST|Sakshi
స్కోరుంటేనే రుణం!

బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు చెక్‌
సిబిల్‌ నివేదిక, స్కోరు ఆధారంగానే అన్ని రుణాలు
రూ. 50 వేలపైన ప్రతి రుణ మంజూరుకు 700 స్కోరైనా ఉండాలి
వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా అమలు
అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
నిరర్థక ఆస్తుల అడ్డుకట్టకు ఇదే మార్గమని స్పష్టీకరణ
ఖాతాదారులకు ఏడాదికి మూడుసార్లు ఉచితంగా సిబిల్‌ నివేదిక!


సాక్షి, హైదరాబాద్‌: క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) స్కోరుతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు అడ్డుకట్ట వేసింది. రూ. 50 వేలకు పైన రుణ మంజూరుకు సంబంధించి తప్పనిసరిగా సిబిల్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని, కనీసం 700 పైన స్కోరు ఉన్న వారికే రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక సిబిల్‌ పరిధిలోకి రావాలని అన్ని రకాల సహకార బ్యాంకులకూ సూచించింది. రైతులు తీసుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు, చెల్లింపు ప్రక్రియను సిబిల్‌లో నమోదు చేసేలా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ బ్యాంకులను ఆదేశించింది.

ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా..
అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఇప్పటికే రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిల్‌తో అనుసంధానం చేశారు. రుణాల మంజూరుకు సిబిల్‌ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు దీనిని నూరు శాతం అమలు చేస్తున్నా... ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఎక్కువసార్లు మేనేజర్ల విచక్షణాధికారం మేరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే వచ్చే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కచ్చితంగా సిబిల్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకోవాల్సిందే. ఈ స్కోరు 700లోపు ఉన్న ఖాతాదారులు బ్యాంకుకు ఎంత ప్రాధాన్యత కలిగిన వారైనా.. రుణ దరఖాస్తును తదుపరి పరిశీలనకు తీసుకోరు. నోట్ల రద్దుతో బ్యాంకులకు భారీగా నగదు వచ్చి చేరడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బ్యాంకులకు వచ్చిన నగదును పరపతి సరిగా లేని ఖాతాదారులు, రుణాలు తీసుకుని తరచూ ఎగవేసేవారికి ఇచ్చే అవకాశం లేకుండా త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనుంది.

అన్ని రుణాల మంజూరుకూ..
వ్యక్తిగత అవసరాలకు తీసుకునే రుణాలతో పాటు ఇంటి, వాహన, విద్య, ఆస్తి తాకట్టు రుణాలకు కూడా సిబిల్‌ స్కోరే ప్రామాణికం కానుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం... ఏ ఖాతాదారుడైనా రుణానికి దరఖాస్తు చేసినప్పుడు ముందుగా వారి సిబిల్‌ స్కోరును పరిశీలిస్తారు. స్కోరు 700 కంటే తక్కువగా ఉంటే దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. 700 దాటి ఉంటే రుణ మంజూరుకు అవసరమైన ఇతర పరిశీలన నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయంలో బ్రాంచ్‌ మేనేజర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ప్రస్తుతమున్నట్లుగా దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడానికి బ్యాంకు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అంగీకరించదు.

స్కోరు ఎక్కువగా ఉన్నా..
సిబిల్‌ స్కోరు 700–750 మధ్య ఉన్న ఖాతాదారులకు సంబంధించి అన్ని లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రుణాలు ఎగవేయడం, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు చేసుకోవడం వంటివి కనిపిస్తే.. అర్హతలున్నా అడిగినంత రుణం ఇవ్వరు. కొంత రుణమిచ్చి తరువాత వారు చెల్లించే విధానాన్ని బట్టి అదనపు రుణం ఇస్తారు. స్కోరు 750–850 మధ్య ఉంటే దరఖాస్తుదారు అర్హతలను బట్టి 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. ఏవైనా కంపెనీలు నిరర్థక ఆస్తుల జాబితాలో ఉంటే.. ఆ కంపెనీని నిర్వహిస్తున్న వారికి కూడా రుణం ఇవ్వరు. ఆ కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. విదేశాల్లో తమ పిల్లలను చదివించాలనుకునేవారు వ్యక్తిగత ఆస్తులను తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వీలుంది. అయితే సదరు విద్యార్థి తల్లి లేదా తండ్రి సిబిల్‌ స్కోరు సరిగా లేనిపక్షంలో రుణ దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. పరిచయమున్న బ్యాంకు మేనేజర్‌ లేదా సీనియర్‌ అధికారి తెలిస్తే ఇప్పటిదాకా ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు.

‘రియల్‌’కు ఇబ్బందిగా మారిన సిబిల్‌
తెలిసీ తెలియక క్రెడిట్‌ కార్డులు ఎడాపెడా వాడేసి సకాలంలో తిరిగి చెల్లించకపోతే సిబిల్‌ స్కోరు 500–600 మధ్య ఉంటుంది. ఇంటి రుణాలకు సంబంధించి బ్యాంకులు ఇప్పటికే 75 శాతం సిబిల్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దీంతో 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. నెలకు రూ.లక్ష వేతనం సంపాదించే ఉద్యోగులు సైతం సిబిల్‌ స్కోరు లేకపోవడం వల్ల ఇంటిరుణాలు పొందలేకపోతున్నారు. ‘‘మా బ్యాంకుకు నిత్యం 250 నుంచి 300 రుణ దరఖాస్తులు వస్తాయి. వారంతా ఐటీ కంపెనీల్లో మంచి వేతనానికి పని చేసేవారే. కానీ వారి సిబిల్‌ స్కోరు సరిగా లేని కారణంగా 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి..’’అని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు.

ప్రస్తుతం సిబిల్‌ స్కోరు ఆశించిన స్థాయిలో లేకపోయినా తమ విచక్షణాధికారంతో కొంతమందికి రుణం ఇప్పించగలుగుతున్నామని.. ఇకపై అలాంటి అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి దీనిని కచ్చితంగా అమలు చేస్తే దాని ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎడాపెడా క్రెడిట్‌ కార్డులు ఇవ్వడం, అత్యధిక మొత్తంలో వడ్డీలు విధించడంతో వినియోగదారులు బ్యాంకులతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల విషయంలో సిబిల్‌ స్కోరు ప్రభావితం కాకుండా చూడాలని బ్యాంకర్లే కోరుతున్నారు. వ్యక్తిగత రుణం మరేదైనా రుణం తీసుకుని ఎగవేసిన వారు, ఎన్‌పీఏల్లో చేరిన వారి విషయంలో తాము ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు సిబిల్‌ స్కోరును కచ్చితంగా పాటించాల్సి వస్తే రుణ దరఖాస్తుల తిరస్కరణ భారీగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.

ఏడాదికోసారి ఉచితంగా..!
ఏ బ్యాంకు నుంచైనా రుణం లేదా క్రెడిట్‌ కార్డు తీసుకున్న వారికి ఏడాదిలో మూడు సార్లు ఉచితంగా సిబిల్‌ నివేదిక ఇవ్వాలని రిజర్వు బ్యాంకు గతంలోనే సూచించింది. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి ఏడాదిలో ఒకసారైనా ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనను కూడా సిబిల్‌ అమలు చేయడం లేదు. సిబిల్‌ నివేదిక కావాలనుకునేవారు రూ.550 చెల్లించాల్సిందే, అదీ ఒక్కసారికే. సాధారణంగా సిబిల్‌ నివేదికను చూస్తే తప్ప వినియోగదారుడు తన తప్పునుగానీ, ఆర్థిక సేవల సంస్థ చేసే పొరపాట్లనుగానీ సరిదిద్దుకోవడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకోవడానికి సిబిల్‌ స్కోరును ప్రామాణికం చేయాలనుకుంటే... దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని బ్యాంకర్లు చెబుతున్నారు. లేకపోతే రుణాల జారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నది వారి ఆందోళన. ‘నోట్ల రద్దు’నేపథ్యంలో బ్యాంకులకు భారీ ఎత్తున నగదు రావడంతో ప్రస్తుతం రుణాలివ్వడానికి అవకాశముంది. అయితే ఈ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

సిబిల్‌ అంటే..
దేశంలో వ్యక్తులు, సంస్థల రుణ చరిత్ర (రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లింపులు)ను నమోదు చేసి... బ్యాంకులు సహా వివిధ ఆర్థిక సేవల సంస్థలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ‘క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌’. దీనినే క్లుప్తంగా సిబిల్‌ అని పిలుస్తారు. దేశంలోని చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు దీనితో అనుసంధానమై ఉంటాయి. ఎవరు ఏ బ్యాంకులో, ఏ ఫైనాన్షియల్‌ సంస్థలో.. ఎలాంటి రుణం తీసుకున్నా సిబిల్‌ రికార్డుల్లోకి చేరుతుంది. ఎంత రుణం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా తదితర వివరాలను బ్యాంకులు సిబిల్‌కు పంపిస్తుంటాయి. ఆ సమాచారం ఆధారంగా సిబిల్‌ వారికి సంబంధించిన నివేదికలను, స్కోరును అప్‌డేట్‌ చేస్తుంది. తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డులు, తిరిగి చెల్లిస్తున్న విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబిల్‌ స్కోరును నిర్ణయిస్తారు. ఏ ఖాతాదారుడైనా క్రెడిట్‌ కార్డులు, ఇంటి రుణం, వ్యక్తిగత, వాహన రుణాలు, బంగారంపై రుణాల వంటివి తీసుకుని.. సక్రమంగా వాయిదాల చెల్లింపులు చేస్తుంటే సిబిల్‌ స్కోరు పెరుగుతుంది. లేకపోతే స్కోరు తగ్గుతుంది.

మరిన్ని వార్తలు