‘కనీస వేతనాల ఖరారు బాధ్యత రాష్ట్రాలదే’

24 Jun, 2019 08:17 IST|Sakshi

న్యూఢిల్లీ : కనీస వేతనాలను ఖరారు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలని పరిశ్రమ సంస్థ సీఐఐ స్పష్టం చేసింది. జాతీయ కనీస వేతనం ఉపాధి కల్పనపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాష్ట్రాలే కనీస వేతనాలను నిర్ణయించాలని పేర్కొంది. ఆయా ప్రాంతాలు, నైపుణ్యం, వృత్తి ప్రాతిపదికన రాష్ట్రాలు కనీస వేతనాలను ఖరారు చేయాలని, ఈ వేతనాలు కేంద్రం నిర్ణయించే కనీస వేతనాల కంటే తక్కువగా ఉండరాదని పేర్కొంది.

నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు మార్కెట్‌ శక్తులు వేతనాలు నిర్ధారిస్తుండగా, నైపుణ్యం లేని కార్మికులకు ప్రభుత్వమే కనీస వేతనాలు ఖరారు చేయాలని సీఐఐ సూచించింది. కాగా వేతన బిల్లుపై కోడ్‌కు క్యాబినెట్‌ ఆమోదం కోసం కార్మిక మంత్రిత్వ శాఖ వేచిచూస్తోంది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ బిల్లు ఆమోదం పొందితే రైల్వేలు, గనుల వంటి నిర్ధిష్ట రంగాలకు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను నిర్ధారిస్తుంది. ఇక మిగిలిన ఉపాధి రంగాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను ఖరారు చేస్తాయి. మరోవైపు కేంద్రం జాతీయ కనీస వేతనాన్ని కూడా ప్రకటించనుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు కనీస వేతనాలను సవరించాలని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. ఉపాధి కల్పనను పెద్ద ఎత్తున చేపట్టేందుకు జాతీయ ఉపాధి కల్పన మిషన్‌ను నెలకొల్పాలని సీఐఐ కేంద్రానికి సూచించింది.

>
మరిన్ని వార్తలు