‘పాక్‌ నటులకు వీసా నిరాకరణ’

27 Feb, 2019 10:34 IST|Sakshi

సాక్షి, ముంబై : సినీ, మీడియా రంగాలకు చెందిన పాకిస్తాన్‌ నటులెవరికీ ఎలాంటి వీసా జారీ చేయకుండా పూర్తి నిషేధం విధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అఖిల భారత సినీ వర్కర్ల సంఘం (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. పాక్‌లో భారత మూవీ, ఇతర కంటెంట్‌ను తమ దేశంలో విడుదల కాకుండా పాక్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏఐసీడబ్ల్యూఏ ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదీకి లేఖరాసింది.

పాక్‌ నటులకు వీసా జారీపై పూర్తిస్ధాయి నిషేధం విధించాలని సినీ, మీడియా రంగాల తరపున ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్‌ చేస్తోందని ఈ లేఖలో సంఘం నేతలు స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్‌కు దీటైన జవాబిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ సంఘం పూర్తి బాసటగా నిలుస్తుందని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది.

పాకిస్తాన్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చే దేశాలపై కఠిన నియంత్రణలు విధించాలని, ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌తో మీ పోరాటానికి 130 కోట్ల మంది ప్రజలు మద్దతుగా నిలిచారని వెల్లడించింది. దేశ ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా పాక్‌ నటులకు వీసా నిరాకరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది.

మరిన్ని వార్తలు