సీఐఎస్‌ఎఫ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

4 Mar, 2019 10:08 IST|Sakshi

న్యూఢిల్లీ: సింగిల్‌ లైన్‌ సైకిల్‌ పరేడ్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించడం ద్వారా సీఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్‌ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ‘నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌ వే లో నిర్వహించిన ఈ పరేడ్‌లో ఎక్కడా ఆగకుండా సైకిళ్లకు మధ్య సమ దూరాన్ని పాటిస్తూ పరేడ్‌ నిర్వహించారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ఈ సైకిల్‌ పరేడ్‌ ఏకబిగిన 3.2 కిలోమీటర్ల మేర సాగిందని, ఇప్పటివరకు ఈ రికార్డు ఒకే వరుసలో 1,235 సైకిళ్లతో హుబ్బాల్లి సైకిల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా పేరున ఉందని సీఐఎస్‌ఎఫ్‌ ప్రతినిధి వెల్లడించారు. పరేడ్‌ను సక్రమంగా నిర్వహించాలంటే పూర్తి క్రమశిక్షణ అవసరమని, రెండు సైకిళ్ల మధ్య దూరం మూడో సైకిల్‌ను మించరాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఈమేరకు సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ రంజన్, ఇతర సీనియర్‌ అధికారులకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేసినట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు