పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?

21 Dec, 2019 15:23 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం: పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరమవుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు, రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కునుహరించివేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ పరిణామాలన్నింటికీ కేంద్ర బిందువైన పౌరసత్వ సవరణ చట్టం నిజంగానే భారతీయుల హక్కులకు భంగం కలిగిస్తుందా.. లేదా కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా చెప్పినట్లు దేశంలోని మైనార్టీలకు ఎటువంటి హాని కలిగించదా.. అదే విధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఒక వర్గం ప్రయోజనాలు దెబ్బతింటాయా.. వీటిలో ఎన్నార్సీ పాత్ర ఏమిటి అనే అంశాలను ఒకసారి గమనిద్దాం.

వారికి మాత్రమే మినహాయింపు
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్‌ తలాఖ్ తదితర బిల్లులను ఆమోదించిన తర్వాత నరేంద్ర మోదీ సర్కారు పౌరసత్వ చట్టం- 1955కు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రవేశపెట్టగా అనేక చర్చల అనంతరం బిల్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఆమోదం పొందింది. ఈ క్రమంలో డిసెంబరు 12న రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. కాగా పౌరసత్వ చట్టం-1955 ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరన్న విషయం తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు సడలిస్తూ..పాస్‌పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు 2015లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. వీటికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది.
(‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం)

పౌరసత్వ సవరణ చట్టం గెజిట్‌లో పేర్కొన్న అంశాలు
‘డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. పాస్‌పోర్టు చట్టం 1920లో సీ క్లాజులో సెక్షన్‌ 3లో ఉన్న సబ్‌సెక్షన్‌ 2 ప్రకారం లేదా విదేశీయుల చట్టం 1946లోని కొన్ని ప్రొవిజన్లు తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 2లోని సబ్‌ సెక్షన్‌1 బీ క్లాజులో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది’ అని భారత న్యాయ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొంది. అదే విధంగా ప్రాథమిక చట్టంలోని సెక్షన్‌ 6ఏకు సవరణ చేసి 6బీలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు వెల్లడించింది. 

అదే విధంగా భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలేవీ వర్తించవని పేర్కొంది. అంతేకాకుండా సెక్షన్‌ 7డీ, సెక్షన్‌ 18కు సవరణలు చేసినట్లు తెలిపింది. అదే విధంగా కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన వారు కనీసం ఐదేళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలు కలిగి ఉండాలని తెలిపింది. ఇంతకుముందు ఈ పరిమితి 11 ఏళ్లుగా ఉండేది.
(సీఏఏ : మరో కీలక పరిణామం)

ముస్లింలకు వ్యతిరేకం కాదు: అమిత్‌ షా 
పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా... ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు. మతతత్వ రాజకీయాలకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు. ఇందుకు స్పందించిన అమిత్‌ షా.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు.

అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని.. అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది అని విమర్శించారు.

చీకటి రోజు: సోనియా గాంధీ
ఇక పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. దీనిని విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయంగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
(సీఏఏపై కేంద్రానికి మమత సవాలు)

ఎన్నార్సీ అమలైతే..
ఇక ప్రస్తుతం సీఏఏతో పాటు ఆందోళనలకు కారణమవుతున్న మరో ముఖ్య అంశం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్నార్సీ). జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులందరితో కూడిన జాబితాను క్లుప్తంగా ఎన్నార్సీ అంటారు. పౌరుల దగ్గర ఉన్న వివిధ పత్రాల ఆధారంగా వారు భారత పౌరులేనని నిర్ధారిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చట్టం అమల్లోకి వస్తే..  ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశముంటుంది. అదే విధంగా వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లభిస్తాయి. అయితే నిజానికి ఎన్నార్సీ అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. ఇది గనుక చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే అక్రమ వలసదారులు మాత్రమే లక్ష్యంగా మారతారు.

అయితే ఇందులో ఓ చిక్కు ఉంది. ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువ. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే.. సీఏఏ ప్రకారం వారికి సులభంగానే భారత పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి.
(ఎన్‌ఆర్సీపై ఆందోళన వద్దు..)

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్నార్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశం నుంచైనా భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన వారూ దేశంలో ఉండటానికి వీలు ఉండదు. దీంతో ఈ దేశాల నుంచి వచ్చిన మెజారిటీ వర్గ ప్రజలు మాత్రమే చిక్కుల్లో పడతారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ ప్రకారం భారతీయులు ఎవరికీ నష్టం లేదని చెబుతున్నప్పటికీ ఎన్నార్సీ ద్వారానే అక్రమ వలసదారులను గుర్తిస్తారు కాబట్టి.. ఇది కచ్చితంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సరైన పత్రాలు లేని వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని.. అలాంటప్పుడు ఇందులో సమస్య ఏముందని సీఏఏ, ఎన్నార్సీని సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ సైతం దేశ శ్రేయస్సు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అక్రమవలస దారులకు మాత్రమే తాము వ్యతిరేకం అని పేర్కొంది.

పౌరసత్వ సవరణ చట్టం: సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్‌​ చేయండి

రణరంగంగా జామియా వర్సిటీ

‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!

కొన్ని రాజకీయ శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయి: గడ్కరీ

అనవసర భయాలు సృష్టిస్తున్నారు: మోదీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు