వారికోసం ప్రత్యేక టాయిలెట్లు..!

10 Sep, 2016 12:38 IST|Sakshi
వారికోసం ప్రత్యేక టాయిలెట్లు..!

భోపాల్ః స్వచ్ఛభారత్ మిషన్ పనుల్లో భాగంగా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హిజ్రాలకోసం ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా నగరానికి మధ్యలో ఉన్న మంగళ్ వారా ప్రాంతం నుంచీ ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్ వెల్లడించింది. ఇందుకోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను (డీపీఆర్) విడుదల చేసినట్లు బీఎంసీ మేయర్ ఆలోక్ శర్మ తెలిపారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ టాయిలెట్లకు 25-30 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మేయర్  తెలిపారు. తాను మేయర్ గా ఉన్న ఈ ప్రాంతంలో  హిజ్రా జనాభా అధికంగా ఉండటంతో ఈ ప్రత్యేక టాయిలెట్ల ఆలోచన చేసినట్లు మేయర్ పేర్కొన్నారు. ప్రత్యేక టాయిలెట్లు లేకపోవడంతో హిజ్రాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని... పురుషులు, స్త్రీలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉన్నపుడు... వారికోసం ఎందుకు నిర్మించకూడదన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్థానిక బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.

ఇంతకు ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా.. ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ సహా 200 సభ్యులుగల కమ్యూనిటీని ఏర్పాటు చేసిందని పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని గ్రామాల్లో బహిరంగ మల మూత్ర విసర్జనకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడంతో సమస్య పరిష్కరించబడినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు