అలోక్‌ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

26 Oct, 2018 09:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చూస్తూ సీబీఐ మాజీ చీఫ్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని సీవీసీని ఆదేశించింది. విచారణకు మూడు వారాల గడువు కావాలన్న సీవీసీ అభ్యర్ధనలను తోసిపుచ్చింది. అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్ధానాలపై  విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షిస్తారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన ఎం. నాగేశ్వరరావు కేవలం పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, ఎలాంటి విధాన నిర్ణయాలను తీసుకోరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 12కు వాయిదా వేసింది. కాగా, తనను అకారణంగా సెలవుపై పంపుతూ, తన స్ధానంలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావును డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని అలోక్‌ వర్మ తన పిటిషన్‌లో సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు.

వర్మ పిటిషన్‌ను నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌  విచారణకు చేపట్టింది. సీబీఐ చీఫ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారణకు చేపట్టాలని అలోక్‌ వర్మ తరపు న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, విజిలెన్స​ కమిషన్‌ తనను సీబీఐ చీఫ్‌గా తప్పిస్తూ రాత్రికిరాత్రి తీసకున్న నిర్ణయం అక్రమమని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేలా కేంద్రం జోక్యం చేసుకుందని అలోక్‌ వర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు