సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!

13 Nov, 2019 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

సీజేఐ కార్యాలయం కూడా ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం  ఈ పిటిషన్లపై విచారణ జరిపి..ఈ  ఏడాది ఏప్రిల్‌ 4న తన తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.
చదవండి: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు

మరిన్ని వార్తలు