యూపీ అధికారులతో సమావేశం కానున్న సీజేఐ

8 Nov, 2019 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్నివర్గాలు అయోధ్య తీర్పుపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయరాదని తమ శ్రేణులను ఆదేశించాయి. అలాగే యూపీ ప్రభుత్వం కూడా అయోధ్యలో భారీగా భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ‌, డీజీపీ ఓం ప్రకాశ్‌సింగ్‌లతో శుక్రవారం సమావేశం కానున్నట్టుగా సమాచారం. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో యూపీలోని శాంతి భద్రతలపై ఆయన వారితో సమీక్ష చేపట్టనున్నారు. సీజేఐ చాంబర్‌లో ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. 

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా గత రాత్రి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లక్నో, అయోధ్యలలో హెలికాఫ్టర్లు అందుబాటులో ఉండనున్నట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. మరోవైపు కేంద్రం కూడా.. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభ్తుత్వం కూడా తీర్పు అనంతరం ఉత్సవాలను జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. 

కాగా, అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు హిందు, ముస్లిం వర్గాల తరఫు లాయర్లు 40 రోజులు వరుసగా తమ వాదనలు వినిపించారు. అక్టోబర్‌ 16వ తేదీన తుది వాదనలు వినడం ముగించిన రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్‌ గొగొయ్‌ పదవీ విరమణ చేయనున్న నవంబర్‌ 17లోపు ప్రకటించే అవకాశముంది. 

మరిన్ని వార్తలు