సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు

16 Nov, 2019 03:14 IST|Sakshi
మహాత్మునికి నివాళులర్పిస్తున్న జస్టిస్‌ గొగోయ్‌, కాబోయే సీజేఐ జస్టిస్‌ బాబ్డేతో ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌

  అయోధ్య సహా కీలక తీర్పుల్లో సూత్రధారి

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న సీజేఐ 

46వ ప్రధాన న్యాయమూర్తి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్‌ డే. 2018, అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌  గొగోయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

వివాదం..
సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్‌ గొగోయ్‌.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్‌ గొగోయ్‌కి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

తిరుగుబాటు..
2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్‌ మీట్‌ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్‌ జడ్జీల్లో(గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌) జస్టిస్‌ గొగోయ్‌ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్‌ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్‌ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్‌ గొగోయ్‌తో పాటు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే.  

ఇటీవలి కీలక తీర్పులు
జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది.  రఫేల్‌ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని.

జస్టిస్‌ గొగోయ్‌ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్‌ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.  శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్‌ గొగోయ్‌ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు.   

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్‌ అసోసియేషన్‌ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జస్టిస్‌ గొగోయ్‌ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఎస్‌సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగోయ్‌ ఒకరని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు రాకేశ్‌ఖన్నా ప్రశంసించారు. జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్‌ గొగోయ్‌.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు