ఆ కేసు విచారణకు గొగోయ్‌ దూరం

21 Jan, 2019 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సీబీఐ చీఫ్‌కు పేర్ల కుదింపు, ఎంపిక, నియామకంలో పారదర్శకత ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా 1986 ఒడిషా కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావును గత ఏడాది అక్టోబర్‌ 23న సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్దానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వారిని ప్రభుత్వం సెలవుపై పంపింది.

తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు వెనువెంటనే ఆస్ధానా అవినీతి కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎకే బస్పీ, డీఐజీ ఎంకే సిన్హా,జాయింట్‌ డైరెక్టర్‌ ఏకే శర్మ సహా పెద్దసంఖ్యలో అధికారులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు వర్మ, ఆస్ధానాల వ్యవహారం న్యాయస్ధానానికి చేరిన క్రమంలో నాగేశ్వరరావును ప్రభుత్వం అడిషనల్‌ డైరెక్టర్‌ స్ధాయికి ప్రమోట్‌ చేసింది.

మరిన్ని వార్తలు