జడ్జీలను పెంచండి

23 Jun, 2019 04:46 IST|Sakshi

మాజీ జడ్జీలను నిర్ణీతకాలానికి తిరిగి నియమించండి

ప్రధాని మోదీకి సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ లేఖలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్‌ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్‌ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు.

హైకోర్టుల్లో తీవ్రమైన కొరత..
హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్‌ గొగోయ్‌ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి.

గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్‌ గొగోయ్‌ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా