షిల్లాంగ్‌లో మళ్లీ ఘర్షణలు.. ఆర్మీ ఫ్లాగ్‌ మార్చ్‌ 

5 Jun, 2018 02:08 IST|Sakshi
ఘర్షణల్లో ధ్వంసమైన బస్సు

షిల్లాంగ్‌: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. షిల్లాంగ్‌లో విధించిన కర్ఫ్యూను భద్రతాబలగాలు ఆదివారం 8 గంటల పాటు ఎత్తివేయడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు మావ్‌లైలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు మళ్లీ కర్ఫ్యూను విధించారు. మరోవైపు సోమవారం షిల్లాంగ్‌కు చేరుకున్న ఆర్మీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ను నిర్వహించింది. స్థానిక గిరిజన తెగ ప్రజలకు, ఇక్కడే స్థిరపడ్డ పంజాబీలకు మధ్య గొడవ జరగడంతో గత ఐదు రోజులుగా నగరం అట్టుడుకుతోంది. కాగా, షిల్లాంగ్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించేందుకు 1,500 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని మోహరించినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి అదనంగా కేంద్రం మరో 10 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిందన్నారు.

అల్లర్లను రెచ్చగొట్టేందుకు దాదాపు 500 మంది దుండగులు నగరంలోకి ప్రవేశించారన్న నిఘావర్గాల హెచ్చరికతోనే కర్ఫ్యూను పునరుద్ధరించినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం కన్రాడ్‌ సంగ్మా.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్‌ మంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ నేతృత్వంలో మేఘాలయకు వచ్చిన ప్రతినిధుల బృందానికి వాస్తవ పరిస్థితిని తెలిపామన్నారు. కాగా, ఈ ఘర్షణలపై విచారణకు తమ ప్రతినిధి మన్‌జిత్‌సింగ్‌ రాయ్‌ను పంపిస్తున్నట్లు జాతీయ మైనారిటీ కమిషన్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు