నకిలీ ట్విటర్‌ ఖాతా తెరిచిన టెన్త్‌ విద్యార్థి

23 Apr, 2018 11:58 IST|Sakshi
డీజీపీ ఓపీ సింగ్‌ పేరుతో తెరిచిన నకిలీ ట్విటర్‌ అకౌంట్‌

లక్నో : తన అన్నయ్యకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక ఓ పదో తరగతి విద్యార్థి ఏకంగా డీజీపీ పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతా తెరిచాడు. అంతేకాదు ట్విటర్‌ ద్వారా డీజీపీ ఇచ్చినట్టుగా ఆదేశాలు పంపించి పోలీసులతో తన పని చేయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఈ ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

మహారాజ్‌గంజ్‌కు చెందిన సాదిక్‌ అన్సారీ అనే వ్యక్తి బాలుడి సోదరుని నుంచి రూ. 45 వేలు అప్పుగా తీసుకున్నాడు. బదులుగా తన సోదరునికి దుబాయ్‌లో ఉపాధి చూపిస్తానని చెప్పాడు. కానీ అన్సారీ బాలుడి కుటుంబాన్ని మోసం చేయడంతో వారు గుల్హారీ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడి మీద ఫిర్యాదు చేశారు. కానీ​ పోలీసులు ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతాను తెరిచాడు. అనంతరం ఆ ట్విటర్‌ అకౌంట్‌ నుంచి విచారణను వేగవంతం చేయాలని గోరఖ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీకి ఆదేశాలు జారీ చేశాడు.

డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయనుకుని పోలీసులు తక్షణం స్పందించారు. సాదిక్‌ అన్సారీ నుంచి బాలుడి సోదరుడికి 30 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మిగతా డబ్బు త్వరలోనే తిరిగిస్తానని అతడితో హామీ యిప్పించారు. కేసు పరిష్కరమైనట్టు డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్‌ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని డీజీపీ ఆఫీసు నుంచి సమాధానం వచ్చింది. దీంతో కూపీ లాగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.

నకిలీ ట్విటర్‌ ఖాతా తెరిచిన బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, గ్రామంలోని తన స్నేహితుని సహాయంతో తాను ఇదంతా చేసినట్టు అతడు ఒప్పుకున్నట్టు సైబర్‌ సెల్‌ ఇన్సెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. బాలుడి భవిష్యత్తును పాడు చేయకూడదన్న ఉద్దేశంతో కేసు నమోదు చేయలేదని, గట్టిగా హెచ్చరించి వదిలేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు