ఫేస్‌బుక్‌లో ‘క్లీన్‌ ది నేషన్‌’ గ్రూపులు

19 Feb, 2019 17:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మన సైనికులను ఎవరు అపహాస్యం చేస్తున్నారో, వారి పట్ల ఎవరు అవమానకరంగా మాట్లాడుతున్నారో వెతికి పట్టుకోండి! వారి పనిచేస్తున్న ఆఫీసులకు, కంపెనీలకు, వారు చదువుతున్న యూనివర్శిటీలకు ఫోన్లు చేయండి, ఈ మెయిల్స్‌ పంపండి. సదరు ఉద్యోగులను తొలగించేలా, విద్యార్థులను సస్పెండ్‌ చేసేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురండి. వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులపైనా ఒత్తిడి తీసుకరండి! స్క్రూ... దెమ్‌. దేశంలో ఉంటూ, భారతీయులమని చెప్పుకుంటూ మన సంస్కృతిని, మన ప్రజలను మన సైన్యాన్ని అవమానిస్తున్న వారిని ఏరిపారేయడం కోసం ఈ గ్రూపు ఆవిర్భవించింది. మన ప్రతిష్టాత్మకమైన సైన్యం పొరుగునున్న శత్రువులపై సర్జికల్‌ దాడులు జరుపుతుంది. మనం దేశంలో ఉన్న శత్రువులను తరిమి కొడదాం’ అన్న సందేశంతో ‘క్లీన్‌ ది నేషన్‌’ పేరిట్‌ శనివారం నాడు ఓ ఫేస్‌బుక్‌ గ్రూప్‌  అవతరించింది.
 
మధుర్‌ జక్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో 42 మంది వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. వీరిలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఉన్నారు. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులను ఫాలో అవుతున్న అంకిత్‌ జైన్‌ లాంటి వారు పేజీ అడ్మినిస్ట్రేటర్లుగా ఉన్నారు. సోమవారం సాయంత్రానికి ఈ గ్రూపు సభ్యుల సంఖ్య 5,400కి చేరుకుంది. తమ కారణంగా యాభై మందిపై కంపెనీల యజమానులు, యూనివర్శిటీలు చర్యలు తీసుకున్నాయని ఈ గ్రూపు గర్వంగా ప్రకటించుకుంది. 50 మంది వేధింపులకు, ఉద్వాసనలకు, గురవడమే కాకుండా పోలీసు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అది ‘క్లీన్‌ ది నేషన్‌’ ఒక్క గ్రూపు కారణంగానే జరగలేదు. అలాంటి పలు సోషల్‌ గ్రూపుల కారణంగా జరిగింది. జరుగుతోంది. గ్రూపు అవతరించిన సందర్భంగా వ్యవస్థాపకుడు మధుర్‌ జక్‌ సింగ్‌ ‘ఇండియన్‌ ఆర్మీ’ అంటూ ముద్రించిన పసుపురంగు టీ షర్టును ధరించిన వీడియోను విడుదల చేయగా, ఇతర వ్యవస్థాపక సభ్యులు తాము ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలతో దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 

ప్రొఫెసర్‌కు ఉద్వాసన, అదశ్యం
‘క్లీన్‌ ది నేషన్‌’ గ్రూపునకు గువాహటి కళాశాలలో గత ఏడేళ్లుగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పాప్రి బెనర్జీ తొలి టార్గెట్‌ అయ్యారు. ‘ఈ ప్రభుత్వం ఊదరగొడుతున్న జాతీయ వాదానికి సైనికులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది’ అని ఆమె పెట్టిన పోస్టింగ్‌ ఈ గ్రూపునకు కోపం తెప్పించింది. అత్యాచారం చేసి, హత్య చేస్తామంటూ హెచ్చరికలే కాకుండా రాళ్లతో కొట్టి చంపాలనే సందేశాలను ఈ గ్రూపు సభ్యులు పంపించారు. వీరి ఒత్తిడికి లొంగి గువాహటి పోలీసులు ఆమెపై ఐపీసీలోని 505 సెక్షన్‌ కింద, ఐటీలోని 66వ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు.

గువాహటికి 300 కిలోమీటర్ల దూరంలోఉన్న సిల్చర్‌ పోలీసులు కూడా ఆమెపై ఐపీసీ 294, 506, ఐటీ 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాము ఈ కేసును గువాహటి పోలీసులకు బదిలీ చేస్తామని సిల్చర్‌ పోలీసు అధికారి నితుమోని గోస్వామి తెలిపారు. ప్రొఫెసర్‌ బెనర్జీని అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా విచారించిన పోలీసులు, తిరిగి సోమవారం ఉదయం పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆమెను ఆదేశించి ఇంటికి పంపించారు. అదే రోజు ఆమె వివరణను కోరిన కాలేజీ యజమాన్యం ‘మీ వివరణ సమంజసంగా లేదు’ అంటూ ఆమెను సస్పెండ్‌ చేసింది. శనివారం రాత్రిలోగా ఈ పరిణామాలన్నీ చకా చకా జరిగాయి. ఆ మరుసటి రోజు, ఆదివారం ఉదయం బెనర్జీ ఇంటి నుంచి అదశ్యమయ్యారు. ‘నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నా గురించి బెంగపడవద్దు’ అంటూ తండ్రి, సోదరుడి పేరిట లేఖ రాసి ఆమె ఇంటి నుంచి నిష్క్రమించారు. అత్యాచారం చేసి, హత్య చేస్తామంటూ బెదిరించినందుకు అమ్మాయి పారిపోయి ఉంటుందని తండ్రి రోదిస్తున్నారు. 

మణిపూర్‌ ఎడిటర్‌పై టార్గెట్‌
‘నన్ను క్షమించండి, సైనికుల మృతికి నేను కన్నీళ్లు కార్చలేక పోతున్నందుకు, ఇలాంటి సైనికులే మణిపూర్‌లో మా అమ్మాయిలపై అత్యాచారాలు జరిపి ఎలాంటి శిక్షలు లేకుండా తిరుగుతున్నారు’ అంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేసిన ‘ప్రొవోక్‌ లైఫ్‌ స్టైల్‌ మాగజైన్‌’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రోమల్‌ లైస్రామ్‌కు ఉద్వాసన చెప్పాల్సిందిగా యాజమాన్యంపై గ్రూప్‌ ఒత్తిడి తీసుకొచ్చింది. ‘ఆయన భావ ప్రకనటనా స్వేచ్ఛను మేమే గౌరవిస్తాం. అందుకనే ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేం’ అంటూ యజమాన్యం బదులిచ్చింది. 

అభ్యంతర పోస్టులు పెట్టారంటూ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి పట్టణంలో ఆదివారం నాడు ఓ విద్యార్థిని దేబి బిశ్వాస్, హబ్రాకు చెందిన మరో విద్యార్థిని అర్పణ్‌ రక్షిత ఇళ్లపై మూక దాడులు జరిగాయి. రాజస్థాన్‌లో నలుగురు విద్యార్థులు యూనివర్శిటీల నుంచి సస్పెండయ్యారు. బీహార్, కర్ణాటక, డెహ్రాడూన్‌లలో కూడా ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ల కారణంగా మూక దాడులు జరిగాయి. ఇలాంటి సంఘటనలపై ఆలస్యంగానైనా స్పందించిన జాతీయ ప్రధాన మీడియా దాడులను ప్రోత్సహిస్తున్న ‘క్లీన్‌ ది నేషన్‌’ లాంటి గ్రూపులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘క్లీన్‌ ది నేషన్‌’ గ్రూపు సోమవారం రాత్రి మాయమయింది. గ్రూపే తప్పుకుందా ? ఆ గ్రూపును ఫేస్‌బుక్‌ యాజమాన్యం తొలగించిందా ? అన్నది స్పష్టం కావడం లేదు. 

మరిన్ని వార్తలు