'ఆ మూడు దేశాలు కలిస్తే ఇంకా సూపర్'

9 Dec, 2015 15:37 IST|Sakshi
'ఆ మూడు దేశాలు కలిస్తే ఇంకా సూపర్'

బెంగళూరు: భారత్, జపాన్, అమెరికాల మధ్య కొన్ని అంశాల విషయంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని టిబెట్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఈ మూడు దేశాలకు కూడా ప్రజాస్వామ్యం, స్వేచ్చాయుత పరిపాలన, బావప్రకటన స్వేచ్ఛ అనే అంశాల్లో ఒకే విధమైన అభిప్రాయాలున్నాయని, అందుకే ఈ దేశాలు సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న దలైలామా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను వెల్లడించారు.

'నేను తరుచుగా చెప్తుంటాను. మొత్తం ఆసియాలోనే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కలిగి స్థిరంగా కొనసాగుతున్న ఏకైక దేశం భారత దేశమేనని. ఇక జపాన్ పారిశ్రామికీకరణ చెందిన ప్రజస్వామ్యయుత దేశం. అలాగే అమెరికా ఒక స్వేచ్ఛా ప్రపంచం. సమానత్వం అక్కడ వర్ధిల్లుతుంది. ఈ మూడు దేశాల మధ్య ఆయా అంశాల విషయంలో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే అది ఒక నిరంకుశ ప్రభుత్వాన్నికలిగిన దేశం. అయితే చైనా గొప్పదేశమని, అక్కడి ప్రజలు గొప్పవారని మాత్రం చెప్పగలను. వారు కష్టపడి పనిచేసే తత్వాన్ని మేం ఎప్పటికీ గౌరవిస్తాం. అయితే, వారి నిరంకుశాన్ని మాత్రం ఈ రోజుల్లో ఆమోదించలేం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు