కరోనా కట్టడికి సోనా రోబోల సాయం

16 May, 2020 08:55 IST|Sakshi

జైపూర్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన క్లబ్‌ ఫస్ట్‌ కంపెనీ తన వంతుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్యులకు, ఆసుపత్రిలోని మిగతా సిబ్బందికి వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అరికట్టడానికి సొంత టెక్నాలజీతో రూపొందించిన సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఆసుపత్రుల్లోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వైరస్ సోకకుండా నివారించేందుకు రోబో సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పేషెంట్లు, హెల్త్ సిబ్బందికి మధ్య ఇంటరాక్షన్‌ను తగ్గించడంతోపాటూ పీపీఈ కిట్ల కొరత కారణంగా వాటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ అందజేయడం, చెత్తను సేకరించే పనులను సైతం ఈ రోబోలు సులువుగా చేయగలవు. ఇందులో అమర్చిన కెమెరా ద్వారా రోగి ఏం చేస్తున్నాడో వైద్యులు తమ గదిలోని స్క్రీన్‌పై చూడవచ్చు.

సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతో పాటూ మాస్కులు ధరించారా లేదా అనే విషయాలను కూడా గుర్తించగలవని సంస్థ ఎండీ భువనేశ్‌ మిశ్రా తెలిపారు. తాము తయారు చేస్తోన్న రోబోల్లో 95శాతం భారత ముడిసరుకులనే వాడుతున్నామన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా స్పైన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ రోబోలను తయారు చేశామని చెప్పారు. ఈ టెక్నాలజీతో పనులు చేసే సమయాల్లో రోబోలు బ్యాలెన్సింగ్‌ చేసుకోవడం చాలా సులువు అవుతుందని తెలిపారు. సోనా2.5, సోనా 1.5, సోనా 0.5 రోబోలు ఏదో ఒక మార్గాల్లోనే వెళ్లేవి కావని, స్వీయ మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం ఉన్న రోబోలు అని భువనేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వయం సంవృద్ధి’ పిలుపుతో ముందుకు అడుగులేస్తోంది క్లబ్‌ ఫస్ట్‌ కంపెనీ. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెద్ద మొత్తంలో రోబోలను తయారు చేయడం ప్రారంభించింది. రోబోల బరువు ఆధారంగా విభజించి డిజైన్లలో మార్పులు చేశారు. ఇంకా అగ్రిమాపక సిబ్బందికి ఆపద సమయాల్లో ఉపయోగపడే రోబోలను సైతం ఈ సంస్థ తయారు చేస్తోంది.

మరిన్ని వార్తలు