తప్పు దిద్దుకుంటున్న సీఎం యోగి

17 Oct, 2017 16:09 IST|Sakshi

భారతీయ కూలీల నెత్తురు, చెమటతో కట్టిందే తాజ్‌మహల్‌

కట్టించింది ఎవరు, ఎందుకన్నది ప్రస్తుతానికి అనవసరం..

వివాదాన్ని చల్లార్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు.. 26న తాజ్‌ సందర్శన

సాక్షి : ప్రపంచ వితల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, బీజేపీ చేసిన వరుస తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. 17వ శతాబ్ధి కట్టడంపై ఆయన గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా నేడు సానుకూల ప్రకటన చేశారు. తాజ్‌మహల్‌ కట్టింది ద్రోహులని, అదొక బానిస కట్టడమని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ బహిరంగ సభలో మాట్లాడిన దరిమిలా అన్నివైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వివాదాలను చల్లార్చే ప్రయత్నం చేశారు సీఎం యోగి.

తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? : మంగళవారం లక్నోలో విలేకరులతో మాట్లాడిన సీఎం ఆదిత్యనాథ్‌.. ‘‘తాజ్‌మహల్‌ను ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది అనవసరం. భారతీయ కూలీల నెత్తురు, చెమటలతో దాన్ని కట్టారు. ఇప్పటికే తాజ్‌ గొప్ప పర్యాటక కేంద్రం. కాబట్టి ఆ కట్టడాన్ని పరిరక్షిస్తూ, పర్యాటకుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది’’ అని చెప్పారు.

వివాదం ముదిరిందిలా.. : యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఇదే యోగి ఆదిత్యనాథ్‌ ‘తాజ్‌మహల్‌ భారత సాంస్కృతిక చిహ్నం కాబోదు’ అని ప్రకటించడం తెలిసిందే. ఆ తరువాత పర్యాటక శాఖ ప్రచురించిన టైరిస్ట్‌ గైడ్‌ బుక్‌లెట్‌లో తాజ్‌ను తొలగించడం, దాని స్థానంలో యోగి ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్‌నాథ్‌ మఠాన్ని చేర్చాలనుకోవడం తదితర పరిణామాలు వివాదాన్ని మరింతగా రాజేశాయి. ఆదివారం మీరట్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ తాజ్‌మహల్‌ సహా ఇతర చారిత్రక కట్టడాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో అగ్గిరాజుకుంది. దీంతో నష్టనివారణకు సాక్షాత్తూ ప్రధాని మోదీనే తాజ్‌పై ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రధాని ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే యూపీ సీఎం యోగి మీడియాతో మాట్లాడారు.

26న తాజ్‌ సందర్శనకు యోగి : వివాదాలు చల్లార్చేక్రమంలో యూపీ సీఎం యోగి అక్టోబర్‌ 26న తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని సీఎంవో మంగళవారం ప్రకటించింది.

సంగీత్‌ సోమ్‌ విద్వేష ప్రసంగం : మీరట్‌లో బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ మాట్లాడుతూ.. ‘‘ తాజ్‌మహల్‌ను కట్టించింది ద్రోహులు. అదొక బానిస కట్టడం. మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం? తండ్రిని జైలులో బంధించి, తాజ్‌మహల్‌ను కట్టినాయన గురించా! అతను(షాజహాన్‌) హిందువులను ఊచకోత కోయాలనుకున్నాడు. ఇదే వాస్తవచరిత్ర అయితే, దానిని మనం ఖచ్చితంగా తిరగరాయాల్సిన అవసరం ఉంది’’ అని విద్వేష వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు