అదంతా...కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే..

16 Sep, 2016 17:05 IST|Sakshi
అదంతా...కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో ఒకే సారి ముఖ్యమంత్రితో సహా 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాకివ్వడానికి సిద్ధమయ్యారు. వీరంతా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీఏ)లో చేరడానికి రంగం సిద్ధమైంది. పీపీఏ, బీజేపీ ఇటీవలే ఒక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ విమర్శలపై స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు తమ అభిష్టం మేరకే అక్కడి ప్రాంతీయ పార్టీలో చేరుతున్నారని.. ఈ విషయంలో బీజేపీ చేసేదేంలేదని రిజిజు అన్నారు. కాంగ్రెస్ స్వీయ వైఫల్యానికి బీజేపీని నిందించొద్దని సూచించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కలవడానికి కూడా కొన్ని రోజులవరకు ఆగాల్సివస్తే వారు అలాంటి పార్టీలో ఎలా కొనసాగుతారని రిజిజు ప్రశ్నించారు.
 
మరిన్ని వార్తలు