కోవిడ్‌: 75శాతం కేసులు అలాంటివే..!

10 May, 2020 15:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్న వలస కార్మికులంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సురక్షితం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆదివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. 'దేశ రాజధానిలోని వలస కార్మికులు ఇ‍క్కడే ఉండాలని, కాలినడకన వారివారి ప్రదేశాలకు వెళ్లవద్దని కోరారు. వలస కార్మికుల కోసం మరిన్ని రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మా ప్రభుత్వం మీ బాధ్యత తీసుకుంటుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికే మేము ఇ‍క్కడ ఉన్నామని' తెలియజేశారు.

నగరంలో కరోనా వైరస్‌ కేసుల గురించి మాట్లాడుతూ.. దేశరాజధానిలో 6,923 కేసులున్నాయి. వీటిలో 75శాతం కేసుల్లో కోవిడ్‌-19 లక్షణాలు కనిపించట్లేదని, ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా మాత్రమే ఆ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో 1,476 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి వారి ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. చదవండి: ముఖ్యమం‍త్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ 

కాగా, ఇప్పటి వరకు ఢిల్లీలో సంభవించిన 73 కరోనా వైరస్‌ మరణాలలో 82 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారేనని ఆయన తెలిపారు. వృద్ధులపై కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల అంబులెన్స్‌ సర్వీసులను కూడా ప్రభుత్వానికి అవసరమైనపుడు వాడుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వెల్లడించారు. చదవండి: ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు 

మరిన్ని వార్తలు