వరద బాధితులకు విరాళాల వెల్లువ

22 Aug, 2019 16:42 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమిర్‌ తాజాగా వరద బాధితులకు సహాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు. మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించడంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆమీర్‌కు  కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలీవుడ్‌ ‘ఖిలాడి’ అక్షయ్‌ కుమార్‌ కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. రైతులు, వరద బాధితులు, అమరవీరుల కుటుంబాలకు ఆయన ఆపన్న హస్తం అందించారు. అసోంకు వరదలు వచ్చినప్పుడు రూ.2 కోట్లను ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అమీర్‌, అక్షయ్‌ బాటలోనే  గాన కోకిల లతా మంగేష్కర్‌ రూ.11 లక్షలను, బాలీవుడ్‌ బిగ్‌బీ రూ. 51 లక్షలను విరాళంగా ప్రకటించారు.

దీంతో మరికొంతమంది ప్రముఖులు కూడా ముందుకువచ్చి విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ రూ. 5 కోట్లను విరాళంగా ఇవ్వగా ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ రూ. 5 కోట్ల చెక్కును సీఎంకు అందించారు. అలాగే ఆగస్టు 12న బాలీవుడ్‌ కపుల్‌ రితేశ్‌ దేశ్‌ముఖ్‌- జెనీలియా రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహరాష్ట్ర సీఎం ఆపన్న హస్తాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ మంత్రులు, ఫడ్నవీస్‌తో సహా వారి ఒకరోజు వేతనాన్ని రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.వరదల విజృంభన వల్ల పుణెలో ఇప్పటి వరకు 54 మంది చనిపోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

మరిన్ని వార్తలు